Last Updated:
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్ 20న వైభవంగా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పర్యవేక్షణలో భక్తుల సౌకర్యాలకు విస్తృత ఏర్పాట్లు.
విశాఖలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం చందనోత్సవం ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ వేడుకలు నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చిన్న తప్పిదం కూడా జరగకుండా సమష్టిగా పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఏప్రిల్ 20న జరిగే ఈ మహోత్సవానికి సంబంధించి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు (వర్చువల్), జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 17 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ముందస్తుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి లోపాలు సరిదిద్దాలని మంత్రి ఆదేశించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉచిత, రూ.300, రూ.1000, రూ.1500 టిక్కెట్లకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చందనోత్సవం రోజు తెల్లవారుఝామునే కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఉదయం 3 గంటల నుంచి దర్శనాలు మొదలవుతాయని వెల్లడించారు. సుప్రభాత సేవలతో పూజలు ప్రారంభమై, వీఐపీ దర్శనాలు, అనంతరం సాధారణ భక్తుల దర్శనాలు కొనసాగుతాయని తెలిపారు.
అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టం చేసిన అధికారులు, 20వ తేదీ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని తెలిపారు. క్యూలైన్లలో ఉన్న ప్రతి భక్తుడికి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని షామియానాలు, తాగునీటి సదుపాయాలు, హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
భక్తుల రవాణా కోసం ప్రత్యేకంగా 50 ఆర్టీసీ బస్సులు, టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి 30 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టాయిలెట్లు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు. టిక్కెట్ల జారీ విషయంలో గందరగోళం లేకుండా బార్‌కోడ్, హోలోగ్రామ్ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. సీసీ కెమెరాలు విస్తృతంగా ఏర్పాటు చేయడంతో పాటు, జేబుదొంగలపై నిఘా పెంచుతున్నారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ విధానం అమలు చేయనున్నారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈసారి చందనోత్సవాన్ని మరింత సజావుగా, భక్తులకు అనుకూలంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ చేపడుతున్న ఈ ఏర్పాట్లు భక్తుల్లో మరింత ఆనందాన్ని నింపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Mar 24, 2026 10:57 PM IST



