దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన
. తెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్
. చర్చలు జరగలేదని స్పష్టీకరణ
. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు
వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై స్పందించిన ఇరాన్ ట్రంప్ భయపడ్డారని పేర్కొంది. తాము ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టంచేసింది. ట్రంప్ ప్రకటనతో ముడిచమురు ధరలు అమాంతం పడిపోయాయి. హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్‌కు విధించిన 48 గంటల డెడ్‌లైన్‌ను ట్రంప్ వాయిదా వేశారు. ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఇంధన మౌలిక వసతులపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపి వేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమాసియాలో తమ మధ్య ఉన్న శత్రుత్వాలకు సమగ్ర పరిష్కారం కనుగొనే దిశగా అమెరికా, ఇరాన్ గత రెండు రోజులుగా ఫలవంతమైన చర్చలు జరిపాయని తెలియజేశారు. ఈ వారం అంతటా తమ మధ్య లోతైన, సవివరమైన, నిర్మాణాత్మక చర్చలు కొనసాగనున్నాయని పోస్టుచేశారు. సానుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరపాల్సిన అన్ని రకాల సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని యుద్ధ శాఖను ఆదేశించానని పేర్కొన్నారు. అయితే, పూర్తి నిర్ణయం మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు, చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ‘ఈ విషయంపై మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ ‘ట్రూత’ వేదికగా రాసుకొచ్చారు. అటు తమ హెచ్చరికలతో ట్రంప్ భయపడిపోయారని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. పర్షియన్ గల్ఫ్ అంతటా మైన్లు పెడతామని, గల్ఫ్‌లోని విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని తాము చేసిన హెచ్చరిక వల్లే ఆయన వెనక్కి తగ్గారని పేర్కొంది. నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్న ట్రంప్ వాదనను తిరస్కరించింది. ట్రంప్‌తో ప్రత్యక్షంగా గానీ మధ్యవర్తుల ద్వారా గానీ ఎలాంటి చర్చలు జరగలేదని పేర్కొంది. చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు అని విమర్శించింది. యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని, అయితే తాము చర్చల ప్రతిపాదను తిరస్కరించామని ఇరాన్ స్పష్టం చేసింది. అసలు చొరవ తీసుకోవాల్సిందీ, యుద్ధ విరమణ ప్రతిపాదన చేయాల్సిందీ యుద్ధం ప్రారంభించిన దేశం (ఇజ్రాయెల్) అని ఇరాన్ ఉద్ఘాటించింది. అటు ఇరాన్ సైన్యం కూడా ట్రంప్‌ను ఎద్దేవా చేసింది. ‘హే ట్రంప్, నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అంటూ ఖతమ్ అల్-అన్బియా కేంద్ర ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఇబ్రహీం జొల్ఫఘారి ఎగతాళి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు అంటూ ట్రంప్ చేసిన పోస్టును ఉటంకిస్తూ జొల్ఫఘారి ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు. మరోవైపు ఇరాన్ విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తామని ట్రంప్ ప్రకటన చేయగానే ఇంధన ధరలు అమాంతం పడిపోయాయి. బ్యారెల్ ముడి చమురు ధర 13 శాతం, అంటే సుమారు 17 డాలర్లు తగ్గి 96 డాలర్లకు చేరుకుంది.
కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు
నాలుగో వారంలో కూడా పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్‌లోని అణు కేంద్రం సమీపంలో ఇరాన్ దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతోంది. తెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ విస్తృత దాడులు చేస్తోంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా లక్ష్యంగా భూతల దాడులను కొనసాగిస్తోంది. అటు ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) సోమవారం ఉదయం ప్రకటించింది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఐఆర్ జీసీ ప్రతినిధి తెలిపారు. అమెరికా నిఘా విమానాలు ఈ స్థావరాల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నందున వాటిని లక్ష్యంగా చేసుకున్నా మని చెప్పారు. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన ఐదు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, సౌదీ అరేబియా తమ దేశంపైకి వస్తున్న ఇరాన్ ఆయుధాలను అడ్డుకుంది. రియాద్, తూర్పు ప్రాంతం లక్ష్యంగా వచ్చిన రెండు డ్రోన్లు, ఒక బాలిస్టిక్ క్షిపణిని తమ వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలపై కొత్తగా బాంబు దాడులు మొదలుపెట్టింది. తమ లక్ష్యాలను సాధించే దిశగా యుద్ధం సరైన మార్గంలోనే సాగుతోందని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్ సైనిక సామర్థ్యాలు పూర్తిగా నాశనమయ్యాయన్న అమెరికా వాదనను ఖండిస్తూ అధునాతన ఆయుధాలతో నిండిన భూగర్భ సైనిక సముదాయాన్ని చూపిస్తున్న వీడియోను ఇరాన్ విడుదల చేసింది.
అమెరికాతో ఎప్పటికీ చర్చలు ఉండబోవు: అరాఘ్చీ
అమెరికాతో ఎప్పటికీ చర్చలు ఉండబోవని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తేల్చిచెప్పారు. సైనికచర్య ఉండదని హామీ ఇచ్చి అమెరికా మోసం చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స’లో ఓ వీడియోను పోస్టు చేశారు. దౌత్యానికి అవకాశమే లేని విధంగా పరిస్థితులు మారిపోయినట్లు అబ్బాస్ చెప్పారు. 3 విడతల చర్చల్లో పురోగతి సాధించినప్పటికీ ఎలాగైనా తమపై దాడి చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. అమెరికా విశ్వాసఘాతుకానికి పాల్పడిందన్నారు. పశ్చిమాసియా యుద్ధం దౌత్యమార్గం ద్వారాలను పూర్తిగా మూసివేసిందని పేర్కొన్నారు.
ఇరాన్ వినూత్న నిరసన
ఇరాన్ వినూత్న నిరసనకు తెరతీసింది. ఇజ్రాయిల్‌పైకి ప్రయోగించిన తమ క్షిపణులపై “ఇది అక్రమ యుద్ధం మాత్రమే కాదు అమానవీయం. థ్యాంక్యూ ప్రైమ్ మినిస్టర” అంటూ శాంతి సందేశాన్ని రాసి పంపింది. ఈ చర్య ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, గజా, లెబనాన్లలో హింసను ఆపాలని, ఐరోపా దేశాలు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలనే ఇరాన్ తమ వ్యూహాంలో భాగంగా ఉపయోగించుకుంది. క్షిపణులపై శాంచెజ్ పేరుతో సహా ఆయన మాటలు రాసిన స్టిక్కర్ ను అంటించి ప్రయోగించింది.
భారత్ అందించిన సాయానికి కృతజ్ఞత
యుద్ధ పరిస్థితుల్లో భారత్ అందించిన మానవతా సాయంపై ఇరాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల ఇజ్రాయిల్ జరిపిన సైనిక దాడులతో నష్టపోయిన తమ దేశానికి భారత్ అండగా నిలవడం గొప్ప విషయమని పేర్కొంది. గత వారం తెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో 60 మందికి పైగా పౌరులు మరణించగా… వందలాది మంది గాయపడ్డారు. ఈ కష్ట సమయంలో భారత్ వైద్య, అత్యవసర సహాయాన్ని అందించింది. ఈ సహాయాన్ని ఇరాన్ ఎప్పటికీ మర్చిపోదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌తో మాట్లాడుతూ, యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలాంటి సాయం అందించడం నిజమైన స్నేహానికి నిదర్శనమని ఆయన అన్నారు. భారత్ అధికారికంగా అందించిన సాయంతో పాటు, జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లా ప్రజలు చూపిన చొరవ ఈ ఘటనలో ప్రత్యేకంగా నిలిచింది. పురుషులు, మహిళలు, చిన్నారులు అనే తేడా లేకుండా అందరూ విరాళాలు సేకరించారు. మహిళలు తమ బంగారం, వెండి ఆభరణాలు, రాగి పాత్రలను ఇవ్వగా… కొందరు తమ జీవనాధారమైన పశువులను సైతం విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. బుద్గాం వీధుల్లో ఇరాన్‌కు మద్దతుగా, ఇజ్రాయిల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. ఇరాన్ ప్రజల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.
టోల్ వసూలు వార్తల్లో నిజం లేదు: ఇరాన్ రాయబార కార్యాలయం
హోర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున ఇరాన్ టోల్ ఫీజు విధించనున్నట్లు వస్తున్న వార్తలను భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. ఫీజులకు సంబంధించి తమ అధికారులు ఎవరూ ఎటువంటి ప్రకటన చేయ లేదని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇరాన్‌కు ఆపాదించారని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స’ వేదికగా పోస్టు చేసింది. కొంతమంది చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరూ విశ్వసించవద్దని పేర్కొంది.
The post బెదిరిన ట్రంప్ appeared first on Visalaandhra.


