బీహార్‌ను బీజేపీకి కట్టబెట్టిన నితీశ్


ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రి
జేడీయూకు రెండు ఉపముఖ్యమంత్రి పదవులు?

పట్నా: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజ్యసభకు వెళుతున్నారు. గురువారం రాజ్యసభకు ఆయన నామినేషన్ దాఖలు చేసేశారు. నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోవడంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ముఖ్యమంత్రి పీఠం బీజేపీకే దక్కుతుందని జేడీయూ వర్గాలు తెలిపాయి. రెండు ఉపముఖ్యమంత్రి పదవులు మాత్రం జేడీయూకు దక్కుతాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ముఖ్యమంత్రి రేసులో కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ ముందు వరుసలో ఉన్నారు. బీహార్ తదుపరి ముఖ్యమంత్రి నిత్యానంద్ రాయ్ కావడం ఖాయంగా బీజేపీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీజేపీలో నిత్యానంద్ రాయ్ చాలా సీనియర్ నేతగా ఉన్నారు. అమిత్ షాతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద్ రాయ్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిత్యానంద్ రాయ్… కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 2014, 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఉజియార్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 2000 సంవత్సరం నుంచి హాజీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సీటు. గతంలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగానూ పని చేశారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో అధిష్ఠానం నిత్యానంద్ రాయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ప్రచారంలోకి రావడంతో వైశాలి జిల్లా కర్ణపుర గ్రామంలో నిత్యానంద రాయ్ పూర్వీకుల ఇంట్లో సంబరాలు చేసుకున్నారు. హోలీ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటుండంతో ఈ విషయం చర్చలోకి వచ్చింది. మరోవైపు ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తొలిసారి బీహార్‌లో బీజేపీ సీఎం పీఠం అధిరోహిస్తున్న నేపథ్యంలో అణగారిన వర్గాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా నిత్యానంద్ రాయ్ వైపు అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ-జేడీయూ మధ్య కీలక ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి పదవి బీజేపీ తీసుకుంటుండగా… జేడీయూ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. ఈ మేరకు జేడీయూ వర్గాలు పేర్కొన్నాయి. రెండు వర్గాల మధ్య నిర్ణయం జరిగినట్లుగా వెల్లడించాయి. నితీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి.

The post బీహార్‌ను బీజేపీకి కట్టబెట్టిన నితీశ్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *