బయట అడుగు పెట్టాలంటే భయం.. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..! anantapuram heatwave temperatures soar to 44 degrees. | అనంతపురం వార్తలు (Anantapuram News)


Last Updated:

అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలకు చేరి జనజీవనం దెబ్బతింది, డీహైడ్రేషన్ సన్‌స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిక

ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు…
ఎండలు బాబోయ్ ఎండలు ఎండలు…

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే సూర్యుడు తన తాపాన్ని చూపించడం ప్రారంభించడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. మధ్యాహ్నానికి చేరుకునేసరికి ఉక్కపోతతో జనం అల్లాడిపోతూ చెట్ల నీడ కోసం పరుగులు తీస్తున్నారు. వాహనదారులు కూడా ఎండను తట్టుకోలేక మధ్యలోనే ఆగి విశ్రాంతి తీసుకుంటున్నారు.

పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎండ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వృద్ధులు, చిన్నపిల్లలు బయటకు అడుగు పెట్టాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అనంతపురంలో బుధవారం అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, పుట్టపర్తిలో 40 డిగ్రీలు నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 44 డిగ్రీలకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి.

గాలిలో తేమ తగ్గిపోవడం, భూమి వేడి అధికంగా పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత అత్యధికంగా ఉంటోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ తీవ్ర ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్, అలసట, తలనొప్పి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

వైద్యుల సూచనల ప్రకారం రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గుడ్డ కట్టుకోవడం, సన్ గ్లాసెస్ ధరించడం తప్పనిసరి. తెల్లటి లేదా తేలికపాటి దుస్తులు ధరించడం ద్వారా వేడి ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో చల్లని తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం, కార్మికులకు మధ్యాహ్న విరామం కల్పించడం వంటి చర్యలు అత్యవసరం అని పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ కార్మికులు, కూలీలు ఎండలో పనిచేసే సమయాలను తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో వాతావరణ మార్పులు, అడవుల తగ్గుదల, నగరీకరణ ప్రభావం వల్లే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని సూచిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండి వాతావరణ శాఖ, వైద్యుల సూచనలు పాటించడం ద్వారానే ఎండల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని హెచ్చరిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *