దిల్లీ:ప్రపంచ వృద్ధిలో 16% భారతదేశ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని వృద్ధిపథంలో నడిపించే సత్తా కలిగిన వాహకంగా భారత దేశం అవతరిస్తోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 21వ శతాబ్దిలో భారత్ సంస్కరణల ఎక్స్‌ప్రెస్‌పై స్వారీ చేస్తోందన్నారు. ఈ పరుగును ఒత్తిడితోనే అనివార్య పరిస్థితులతోనో ప్రారంభించలేదని, దృఢమైన విశ్వాసంతో మార్పును తీసుకురావాలన్న నిబద్ధతతో చేపట్టామని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్ వేగంగా పరుగులు తీస్తోందని తెలిపారు. కొవిడ్ విసిరిన సవాళ్లను, సరఫరా వ్యవస్థలకు కలిగిన ఆటంకాన్ని ప్రస్తావిస్తూ..సంక్షోభం చుట్టుముట్టినప్పుడే ఒక దేశం నిజమైన సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. ప్రస్తుత దశాబ్దంలో ఎదురైన ఎన్నో అవరోధాలను అవలీలగా అధిగమిస్తూ భారత్ పురోగమిస్తోందని, ఇది తనకెంతో గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు.


