పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ఐఈఏ ఆందోళన
పారిస్: పశ్చిమాసియా ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (ఐఈఏ) తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఇంధన సంక్షోభం అంతకంతకూ తీవ్రరూపు దాలుస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు పొంచి ఉందని ఐఈఏ చీఫ్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. సోమ వారం ఆస్ట్రేలియా నేషనల్ ప్రెస్ క్లబ్ సమావేశం వేదికగా ఫాతిహ్ బిరోల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్, అమెరికా – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల పశ్చిమాసియా లోని దాదాపు 40 చమురు క్షేత్రాలు, కర్మాగారాలు తీవ్ర, అతితీవ్ర స్థాయుల్లో దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు. దీని ప్రతికూల ప్రభావం ప్రపంచ చమురు రవాణాల సుస్థిరతపై పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు మునుపెన్నడూ లేనంత స్థాయికి ఇంధన సంక్షోభాన్ని తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల అంతర్జాతీయ ఇంధన వ్యవస్థ ఏకకాలంలో భారీ కుదుపులకు గురికావాల్సిన దుస్థితి ఏర్పడిందని బిరోల్ చెప్పారు. గతంలో అనేకసార్లు ప్రపంచం ఎదుర్కొన్న చమురు, గ్యాస్ సంక్షోభాలను ఇప్పుడు ఏకకాలంలో అంతర్జాతీయ సమాజం ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్రముప్పు లాంటివని, వీలైనంత త్వరగా ఈ అంశానికి ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇంధన మార్కెట్లు అస్తవ్యస్తం
యావత్ ప్రపంచానికి జరిగే చమురు, గ్యాస్ సరఫరాలకు కేంద్రంగా ఉన్న పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం వల్ల చమురు -సహజ వాయువు క్షేత్రాలు, కర్మాగారాల మౌలిక సదుపాయాలు దెబ్బతినడం ఆందోళన కలిగించే అంశమని బిరోల్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లు అస్తవ్యస్తం అవుతాయని… ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరుల సరఫరాలు తగ్గిపోయి, వాటి ధరలు పెరిగిపోతాయన్నారు. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్య మార్గాలను వినియోగించాలని… ఈ దిశగా సత్వర చర్యలను చేపట్టాలన్నారు. లేదంటే ప్రపంచ ఇంధన భద్రతకు గండం, ఆర్థిక వ్యవస్థలకు ముప్పు కలుగుతాయని ఐఈఏ చీఫ్ హెచ్చరించారు.


