‘ఎప్స్టీన’ ఆరోపణలే కారణం
జ్యూరిచ్: ప్రపంచ దేశాలను కుదిపివేసిన ఎప్స్టీన్ ఫైళ్ల ఉచ్చులో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ బోర్గే బ్రెండే చిక్కుకున్నారు. ఎప్స్టీన్తో సంబంధాలపై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఈఓగా ఎనిమిదిన్నరేళ్లు పనిచేశానని చెప్ప్పుకున్నారు. రాజీనామా ప్రకటనలో ఎప్స్టీన్ పేరును ఆయన ప్రస్తావించలేదు. 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్కు సంబంధించిన 30 లక్షల పేజీల పత్రాలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. ఈ పత్రాల్లో ప్రముఖుల పేర్లు ఉండటం ప్రకంపనలు సష్టించాయి. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైన కొద్ది వారాలకే బోర్గే బ్రెండే సీఈఓగా తప్ప్పుకోవడం చర్చకు దారితీసింది. అమెరికా న్యాయశాఖ వెల్లడించిన వివరాల ఆధారంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. బ్రెండే మూడు సార్లు ఎప్స్టీన్ ఇచ్చిన విందుల్లో పాల్గొన్నారని, ఈమెయిల్స్, సంక్షిప్త సందేశాలు పంపారని నివేదికలు వెల్లడించాయి. బ్రెండే 2017లో డబ్ల్యూఈఎఫ్t అధ్యక్షుడు అయ్యారు. ప్రపంచ ఆర్థిక ఫోరం తన ముఖ్య పనిని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడానికి ఇదే సరైన సమయమని నమ్ముతున్నట్లు తన రాజీనామా సందర్భంగా బ్రెండే అన్నారు. ఈ వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు ముగిసినట్లు ఫోరం కోచైర్స్ ఆండ్రే హోఫ్మెన్, లారీ ఫింక్ వేరొక ప్రకటనలో వెల్లడించారు.


