అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉంది
ఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం
-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు
(విశాలాంధ్ర-తిరుపతి)
ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు. అమెరికా తన ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. ట్రంప్, నెతన్యాహు తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, అహంకారం కోసం యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబెట్టారని ఆరోపించారు. అమెరికా ఒక ‘వరల్డ్ రౌడీ’లా వ్యవహరిస్తూ… ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలను పెంచి పోషిస్తోందన్నారు. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పుగా పరిణమించిందన్నారు. యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, దీని ప్రభావం నేరుగా సామాన్య ప్రజలపై పడి ఆర్థిక వ్యవస్థలు పతనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వెంటనే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని ట్రంప్, నెతన్యాహులను డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన అన్యాయం
రాష్ట్రంలో 2010కి పూర్వం నియామకమైన ఉపాధ్యాయులు కూడా 2027 ఆగస్టు 31వ తేదీ నాటికి ‘టెట్’ రాసి ఉత్తీర్ణులు కావాలనే నిబంధనను ముప్పాళ్ల తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఎన్నో పరీక్షలు రాసి, దశాబ్దాల అనుభవం గడించిన ఉపాధ్యాయులను మళ్లీ పరీక్ష రాయమనడం విడ్డూరంగా ఉందని, ఇది వారిని కించపరచడమేనని అన్నారు. ఈ సమస్యపై సుప్రీంకోర్టు ఉత్తర్వులతో సంబంధం లేకుండా, కేంద్రంతో చర్చించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు.
కల్కి ట్రస్టు భూములు దళితులకు పంపిణీ చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ… వరదయ్యపాళెం మండలంలో కల్కి ట్రస్టు వారు ఆక్రమించుకున్న దళితుల భూములను వెంటనే స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకు పంచాలన్నారు. ఏడాదికి ఎకరాకు రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దళితుల భూములు ఆక్రమించుకున్న మాట వాస్తవమేనని కల్కి ట్రస్టు వారు న్యాయస్థానంలో విత్ డ్రా పిటిషను ఇటీవల వేశారని హరినాధరెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణ, బాలకృష్ణ, నదియా తదితరులు పాల్గొన్నారు.


