ధర్మవరానికి చెందిన ప్రదీప్ యాదవ్ FIDE నేషనల్ ఇన్స్ట్రక్టర్ బిరుదును అందుకున్నారు. చిన్నప్పటి నుంచి చెస్‌పై ఉన్న ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకున్న ప్రదీప్, ప్రస్తుతం బెంగళూరులోని ఒక అకాడమీలో చెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.
ధర్మవరంలోని కళాక్షేత్రంలో స్థానికులు చెస్ ఆడటం చూసి ఆయనకు ఈ ఆటపై ఆసక్తి కలిగింది. ఆ తరువాత జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నో పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. అనేక పతకాలు, బహుమతులు గెలుచుకున్నారు.
అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత, ప్రదీప్ చెస్‌ను తన జీవితంగా ఎంచుకున్నారు. బెంగళూరులో చెస్ ట్రైనర్‌గా పనిచేస్తూ, కొత్త తరం క్రీడాకారులను తయారు చేస్తున్నారు. తాను సాధించిన ఈ బిరుదు తన ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని ఆయన అన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన తెలిపారు. చెస్‌పై ఉన్న ప్రేమతోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్నానని, జీవితాంతం ఈ ఆటతోనే తన ప్రయాణం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
భవిష్యత్తులో అనంతపురం జిల్లాలో చెస్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంతాల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వాలని ప్రదీప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెస్ బోర్డు తన జీవితమని ఆయన పేర్కొన్నారు.


