. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతాం
. నిరుపేదల సొంతింటి కల ఆశలపై నీళ్లు
. విజృంభిస్తున్న మెడికల్ మాఫియా
. హామీల అమలు కోసం 24న ఉద్యమం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అల్టిమేటం
విశాలాంధ్ర-విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల పెద్దఎత్తున పోరాటం చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ప్రకటించారు. విజయవాడలోని దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16,17,18 తేదీల్లో కాకినాడలో పార్టీ రాష్ట్ర సమితి సమావేశాలు విజయవంతంగా జరిగాయని, ఈ సమావేశాల్లో దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజలు, కార్మికలోకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామని ఈశ్వరయ్య చెప్పారు. ప్రజల పక్షాన పోరాడేందుకు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలని, పేదరిక నిర్మూలన పథకంలో అంతర్భాగంగా ఇళ్లు కట్టించేంతవరకు పేదలకు ఇంటి అద్దెను ప్రభుత్వమే భరించి… సామాజిక బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చించేలా ప్రజలను కూడగడతామని స్పష్టంచేశారు. మెడికల్ మాఫియా పెద్దఎత్తున విజృంభిస్తోందని, వైద్య రంగంలో జరుగుతున్న మోసాలను పాలకులకు తెలిపేందుకు పార్లమెంట్లో ఓ మహిళా ఎంపీ గళమొత్తారని గుర్తుచేశారు. ఆరోగ్యానికి సంబంధించిన బీమా కంపెనీలను దృష్టిలో పెట్టుకొని దేశంలో వైద్యం జరుగుతోందన్నారు. రోగి ఆసుపత్రికి వెళితే వ్యాధి గురించి అడగకుండా… ఏ బీమా కంపెనీ ఆరోగ్య బీమా ఉందని అడగటం సిగ్గుచేటన్నారు. వైద్యులకు లాభాక్ష తప్ప ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యం కనిపించడం లేదని మండిపడ్డారు. ఉన్నత ఆశయాలతో, సేవాభావంతో వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఉన్నారని, అలాంటి వారిని తమ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. వైద్యుల విచ్చలవిడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు అసెంబ్లీలో చర్చించి 2010లో చట్టం తీసుకువస్తే… ఆ చట్టం ఉల్లంఘనకు గురైనట్లు కళ్ల ముందు కనిపిస్తోందని అన్నారు. మరోవైపు వైపు నకిలీ మందులు దేశంలోకి దిగుమతి అవుతున్నాయన్నారు. పేదల కోసం జన ఔషధి పథకం తీసుకువచ్చానని, జనరెక్ మెడిసిన్స్ అందుబాటులో ఉంటాయని ప్రధాని చెబుతున్నారని, కానీ ప్రజలకు నాణ్యమైన పద్ధతుల్లో మెడిసిన్స్ దొరకడం లేదని ఈశ్వరయ్య విమర్శించారు. ఈ సమస్యపై ఫిబ్రవరి 28న డ్రగ్స్ కంట్రోలర్ అధికారుల కార్యాలయాలు, కలెక్టరేట్ల దగ్గర పెద్దఎత్తున సీపీఐ నేతృత్వంలో పోరాటానికి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ప్రభుత్వ వైద్యశాలలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యశాలల్లో కార్డియాక్, యురాలజీ, న్యూరాలజీ, ఫల్మనాలజీ విభాగాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకి రూ.4000 కోట్లు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్ప్పుకుంటోందని, ప్రైవేట్ ఆసుపత్రిలో అవసరం లేకపోయినా వైద్యం చేసి ఆరోగ్య శ్రీ నిధులు దోసేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే నిధులతో ప్రభుత్వ వైద్యశాలలు అభివృద్ధి చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అధికారంలోకి రాకముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, దీనికితోడు ఇంటి నిర్మాణం కోసం రూ. 4 లక్షలు ఇస్తానని నమ్మబలికారని, కానీ దీనిపై ఇప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఈశ్వరయ్య మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాల కోసం సీపీఐ పెద్ద ఉద్యమం నడిపిందని, లబ్ధిదారులతో కలెక్టర్ కార్యాలయాలు, ఎంఆరఓ, సచివాలయాల్లో దరఖాస్తులు అందజేశామని గుర్తుచేశారు. రెండు బడ్జెట్లు పూర్తయినా ఇంతవరకు ఎటువంటి పరిష్కారం చేయలేదన్నారు. ఏరు దాటేంత వరకు ఏరు మల్లన్న, ఏరు దాటిన తర్వాత తూచ్ మల్లన్న అన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారని, మూడు సెంట్లు అంటేనే ప్రజలు కూటమి పార్టీలకు ఓట్లు వేశారని గుర్తు చేశారు. రూ.10 వేల కోట్లతో టిడ్కో ఇల్లు నిర్మాణం చేపట్టామని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం… లబ్ధిదారులకు వాటిని ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ఈ నెల 23వ తేదీ వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, సానుకూల ప్రకటన రాకపోతే లక్షలాది మంది నిరుపేదలతో 24న రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ప్రకటించారు. రూ.4 వేల కోట్లు అవసరమైన వెలుగొండ ప్రాజెక్టు గురించి చంద్రబాబు గొప్పగా చెప్పారని, దీనిని రెండేళ్లలో పూర్తిచేస్తానని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో కేవలం రూ.4 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు.
ప్రజాసమస్యలన్నీ పక్కన పెట్టి… కల్తీ రాజకీయాలు చేయడంతో కూటమి ప్రభుత్వం కల్తీలో కొట్టుకుపోతుందన్నారు. లడ్డూ ఒక్క దానిలోనే కల్తీ కాదని, తినే తిండిలో కల్తీ ఉందని, నీరు, పాలు అంతా కల్తీమయమన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కల్తీ ఆహారాలు అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దేవుడితో రాజకీయాలు చేయొద్దని, ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్, కె.రామాంజనేయులు పాల్గొన్నారు.


