పాలనలో గ్రామాల్లో తిరగని సర్పంచులు
ఇప్పుడు మాజీల ముద్రతో తిప్పలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐదేళ్ల పాటు గ్రామాల్లో చక్రం తిప్పిన సర్పంచుల పదవీ కాలం ముగిసి వారం కావస్తోంది. మొన్నటి వరకు ‘సర్పంచ్ గారు’ అని పిలిపించుకున్న వారు ఇప్పుడు ‘మాజీలు’గా మిగిలిపోయారు. అయితే, పదవిలో ఉన్న కాలంలో ప్రజలతో మమేకమవ్వడంలో మెజారిటీ సర్పంచులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 1044 పంచాయతీల్లో సగానికి పైగా మాజీ సర్పంచులు ప్రజల్లో కనీస గుర్తింపు కూడా పొందలేక పోవడం గమనార్హం.
సొంత గ్రామాల్లోనే సంచరించని వైనం
గ్రామ ప్రథమ పౌరుడిగా ఉండి, ఊరి సమస్యలను తీర్చాల్సిన కొందరు సర్పంచులు.. తమ ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో పర్యటించిన దాఖలాలే లేవని ప్రజలు విమర్శిస్తున్నారు. వీధుల్లో తిరుగుతూ సామాన్యుల కష్టసుఖాలు విచారించాల్సింది పోయి, కేవలం తమ అనుచర వర్గంతోనే కాలక్షేపం చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. “సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ఊరి వైపు కన్నెత్తి చూడని వారు.. ఇప్పుడు మాజీలయ్యాక ఏ ముఖం పెట్టుకుని వస్తారు?” అని గ్రామస్థులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పదవి ఉంటేనే ఉనికి.. పార్టీ పదవుల కోసం పైరవీలు
తాజా మాజీలకు
ప్రస్తుతం సామాన్య ప్రజల్లో ఎలాంటి ఆదరణ లభించకపోవడంతో, ఎలాగైనా సరే పార్టీ తరఫున ఒక పదవిని దక్కించుకోవాలని వీరు తహతహలాడుతున్నారు. ఏదో ఒక అధికారిక హోదా చేతిలో ఉంటేనే ప్రజల్లో మనగలమని, లేదంటే తమ రాజకీయ భవిష్యత్తు కనుమరుగవుతుందని భావిస్తున్నారు. ఈ గుర్తింపు కోసమే పార్టీ అధిష్టానం వద్ద తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సొంత ఇమేజ్ కంటే గ్రూపు రాజకీయాలకే ప్రాధాన్యత
గత ఎన్నికల్లో పార్టీల అండతో గెలుపొందిన కొంతమంది ఐదేళ్ల పాలనలో సొంతంగా ప్రజాబలాన్ని సంపాదించుకోలేకపోయారు. ప్రజల్లో కలవకుండా, కేవలం తమ పార్టీలోని ఒక వర్గాన్ని లేదా గుంపును మాత్రమే ఏర్పాటు చేసుకుని ‘ఏకఛత్రాధిపత్యం’ ప్రదర్శించారన్న సమాచారం క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. ప్రజల మద్దతు కంటే గ్రూపు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇప్పుడు ‘మాజీ’ కాగానే ప్రజల్లో పలచబడ్డారు.
సద్వినియోగం చేసుకోని అవకాశం
గ్రామ స్థాయిలో సర్పంచ్ పదవి అనేది ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. కానీ, జిల్లాలోని చాలా మంది సర్పంచులు ఈ అవకాశాన్ని వదిలేసి, ప్రజలకు దూరంగా ఉంటూ కేవలం పార్టీ వేదికలకే పరిమితమైనట్లు క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. ఇప్పుడు అధిష్టానం ద్వారా ఏదో ఒక పదవి తెచ్చుకుని తమ గుర్తింపును చాటుకోవాలని ఆరాటపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.


