తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు (ఎస్సీఎం) నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రన్నా దాదా ఉన్నారు. 40 ఏళ్లకు పైగా అజ్ఞాతంలో పనిచేసిన ఈ అగ్రనేతలు లొంగుబాటు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీని పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
డీజీపీ శివధర్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లలో నలుగురు సీసీఎంలు, 16మంది ఎస్ఈఎంలు, 26మంది డివిజన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలు.. 85 మంది ఏసీఎస్‌లు, 60 మంది పార్టీ సభ్యులు సహా మొత్తం 591 మంది జన జీవన స్రవంతిలోకి వచ్చారు. తెలంగాణలో పుట్టి, పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్లలో కొంతమంది మాతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వారు కూడా బయటకు వస్తారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎంతో మంది మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి వస్తున్నారు. అలా వచ్చిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రివార్డులు, పునరావాస ప్రయోజనాలు వెంటనే అందిస్తాం.
మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ ఐజీ సుమతి, ఆమె టీమ్‌నకు నా అభినందనలు. ఆమెతో ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్‌కుమార్‌ను కూడా అభినందిస్తున్నా్ణ్ణ అని తెలిపారు. ఈ సందర్భంగా దేవ్‌జీ, బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డిల మావోయిస్టు ప్రయాణాన్ని డీజీపీ వివరించారు. జన జీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టుల హక్కుల కాపాడేందుకు ప్రయత్నిస్తామని అవసరమైతే వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేస్తామని డీజీపీ పునరుద్ఘాటించారు.


