Last Updated:
చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఒక వ్యక్తి పోలీసు వాహనం అపహరించి జాతీయ రహదారిపై దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిసరాల్లో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే గంగవరం మండల కేంద్రం ఒక్కసారిగా హై టెన్షన్ జోన్‌గా మారిపోయింది. పోలీసులే నడిపే పెట్రోలింగ్ వాహనాన్ని ఒక వ్యక్తి అపహరించి, జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళ్లడం ప్రారంభించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.
గంగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో పార్క్ చేసి ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని సడెన్‌గా ఎక్కి తీసుకెళ్లిన నిందితుడు, అదుపు తప్పిన వేగంతో ముందుకు దూసుకెళ్లాడు. మార్గమధ్యంలో ఒక ప్రైవేట్ కారును, మరో ఆటోరిక్షాను ఢీకొట్టడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురికి గాయాలు కావడంతో వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడు మాత్రం ఎక్కడా ఆగకుండా హైవేపై దూసుకెళ్లుతూ దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రయాణికులకు నరకం చూపించాడు.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటాడడం ప్రారంభించారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఒక్కసారిగా సమీపంలోని చెరువులోకి దూకి అందరినీ షాక్‌కు గురిచేశాడు. చెరువు మధ్యలోకి వెళ్లి కొంతసేపు బయటకు రాకుండా ఉండడంతో పోలీసులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. రెండు గంటల పాటు కొనసాగిన ఈ డ్రామా అక్కడి వాతావరణాన్ని ఉత్కంఠభరితంగా మార్చింది.
చెరువులో మధ్యలో నిలబడి పోలీసులను ఆటపట్టించిన నిందితుడు చివరికి స్థానికుల సహాయంతో పట్టుబడ్డాడు. త్రాడుతో కట్టి చెరువు నుంచి బయటకు లాగి ఒడ్డుకు తీసుకువచ్చిన తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ప్రవర్తనను గమనించిన పోలీసులు అతను మానసిక అస్వస్థతతో బాధపడుతున్నాడని అనుమానించారు. అనంతరం అతన్ని పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కర్ణాటక నుంచి వచ్చినట్టు అనుమానిస్తున్న ఈ వ్యక్తి చేసిన వీరంగం కారణంగా గంగవరం నుంచి పలమనేరు వరకు జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. అతను నడిపిన వాహనం నుంచి తప్పించుకున్నవారు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డామని చెబుతున్నారు. ఒకే వ్యక్తి సృష్టించిన ఈ కలకలం రెండు గంటల పాటు పోలీసులకు, ప్రయాణికులకు చుక్కలు చూపించింది. మొత్తంగా పలమనేరు పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు దారితీస్తూ, పోలీస్ భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్న పోలీసులు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


