Last Updated:
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో “పఫీ” రెస్టారెంట్ పెట్స్ మరియు వారి యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రారంభమైంది. పెట్స్‌కు ప్రత్యేక ఫుడ్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, గ్రూమింగ్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ప్రస్తుత సమాజంలో మాట్లాడలేని మూగజీవాల పట్లే ఎక్కువ విశ్వాసం, ప్రేమ చూపిస్తున్న వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ, పిల్లల కంటే ఎక్కువ మమకారం పెంచుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. వాటితోనే ఎక్కువ సమయం గడుపుతూ, ప్రతి చిన్న విషయాన్నీ పంచుకుంటున్నారు. అయితే ఎంత ముద్దుగా పెంచుకున్నా, బయటకు వెళ్లే సమయంలో రెస్టారెంట్లు, హోటళ్లలో పెట్స్‌కు అనుమతి లేకపోవడంతో వాటిని ఇంట్లో వదిలి వెళ్లాల్సిన పరిస్థితి జంతు ప్రేమికులకు బాధ కలిగిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో జంతు ప్రేమికులకు శుభవార్తగా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ప్రత్యేకంగా పెట్స్ మరియు వారి యజమానుల కోసం ప్రారంభమైన “పఫీ” రెస్టారెంట్ ఆహ్వానం పలుకుతోంది. సముద్రతీర సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన విశాఖపట్నం నగరంలో కొత్త కాన్సెప్ట్‌గా నిలిచిన ఈ పెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్ గతేడాది ఆగస్టులో ప్రారంభమైంది. పెంపుడు జంతువులకు అనుకూలంగా అద్భుతమైన ప్రదేశంలో డిజైన్ చేసిన ఈ రెస్టారెంట్, పెట్స్‌ను ఇంట్లో వదిలి బయటకు వెళ్లడం ఇబ్బందిగా భావించే వారికి బెస్ట్ స్పాట్‌గా మారింది.
ఇక్కడ పెట్స్‌కు ప్రత్యేక ఫుడ్ కోర్ట్, యజమానులకు ప్రత్యేక డైనింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు తెరిచి ఉండే ఈ రెస్టారెంట్లో పెట్స్ కోసం బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందుబాటులో ఉంటాయి. స్నాక్స్, సూప్ బౌల్స్, రైస్ బౌల్స్, పానీయాలు వంటి వాటిని పెంపుడు జంతువుల అభిరుచికి అనుగుణంగా తయారు చేస్తారు. అంతేకాదు, పెట్స్ కోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్, గ్రూమింగ్ సెంటర్, హెయిర్ కట్ సదుపాయం కూడా ఉంది. యజమానులు భోజనం చేసేలోపే తమ పెట్స్‌కు అవసరమైన సేవలు పూర్తి చేసుకుని వెళ్లేలా సౌకర్యాలు కల్పించారు.
ఈ రెస్టారెంట్ ప్రారంభానికి కారణం కూడా ఎంతో భావోద్వేగంతో కూడుకున్నదే. తమకూ పెట్స్ ఉన్నాయని, వీకెండ్స్‌లో బయటకు వెళ్లినప్పుడు వాటిని ఇంట్లో వదిలి రావడం వల్ల అవి దిగులుగా ఉండేవని, వాటిని కూడా బయటకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ రెస్టారెంట్ ప్రారంభించామని యజమాని మృణాళిని తెలిపారు. విశాఖలో మంచి స్పందన రావడంతో త్వరలోనే విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్ నగరాల్లో కూడా ఇలాంటి రెస్టారెంట్లు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే మార్షల్ పెట్ జోన్, 24 పెట్ జోన్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ, పఫీ కాన్సెప్ట్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.
పెట్స్ ఉన్నవారికే కాదు, జంతు ప్రేమికులందరికీ స్వాగతం పలుకుతున్న ఈ రెస్టారెంట్‌ను విశాఖవాసులు ఆసక్తిగా ఆదరిస్తున్నారు. చాలా మంది దీన్ని వ్యాపారంగా చూసినా, యజమానులు మాత్రం ఇది మూగజీవాల పట్ల ప్రేమతో చేస్తున్న సేవగా భావిస్తున్నారు. ఇకపై పెట్స్‌ను ఇంట్లో వదిలి వెళ్లాల్సిన అవసరం లేకుండా, వాటితో కలిసి సమయం గడిపే అవకాశం కల్పిస్తున్న ఈ పఫీ రెస్టారెంట్ విశాఖలో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Mar 04, 2026 10:38 PM IST


