రూ.12 కోట్ల షేర్ ట్రేడింగు మోసం
పూణె: మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ వైద్యుడు (75) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కికున్నారు. ఆన్లైన్ షేర్ ట్రేడింగు కుంభకోణంలో రూ.12.31 కోట్లు నష్టపోయారు. జనవరి నెల చివరివారంలో గుర్తుతెలియని నంబరు నుంచి వైద్యునికి ఓ సందేశం వచ్చింది. అందులో కొన్ని షేర్లను సిఫార్సు చేసి, ఓ లింకు ఇచ్చారు. ఆ లింకుపైన క్లిక్ చేయడంతో వైద్యుడిని ప్రత్యేక వాట్సప్ గ్రూపులో చేర్చారు. అంతర్జాతీయ ట్రేడింగ్ కంపెనీని పోలిన ఓ మోసపూరిత యాప్ లింక్‌ను ఆయనకు పంపించి అందులో వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలని సూచించారు. వారిని పూర్తిగా నమ్మేసిన వైద్యుడు మార్చి 7 నుంచి 18వ తేదీ మధ్య ఎనిమిది విడతలుగా మొత్తం రూ.12.31 కోట్లు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. మీకు లాభాలు వచ్చాయంటూ, నగదు రెట్టింపు అయిందంటూ నకిలీ యాప్‌లో భ్రమలు కల్పించారు. మరింత పెట్టుబడి పెట్టాలని బలవంతం చేశారు. వైద్యుడు సంకోచించడంతో ఖాతాలో ఉన్న నగదును సీజ్ చేస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన వైద్యుడు పోలీసులను ఆశ్రయించారు.


