పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి – Visalaandhra


. ముగింపు దశకు ‘మహా స్వప్నం’!
. డయాఫ్రమ్ వాల్ 98 శాతం పూర్తి
. మే 31 నాటికి 21,769 నిర్వాసిత కుటుంబాల తరలింపు లక్ష్యం
. ప్రాజెక్ట్ డీఈఈ, ఏఈఈ వెల్లడి
. ప్రాజెక్టును సందర్శించిన విశాలాంధ్ర పాత్రికేయ బృందం

గోదావరి ప్రవాహం సాక్షిగా ఆంధ్రుల దశాబ్దాల కల ‘పోలవరం’ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ప్రకృతి విసిరిన సవాళ్లు, సాంకేతిక చిక్కుముడులు, వరద పోట్లను తట్టుకొని నదీ గర్భంలో నిర్మిస్తున్న అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం, నిధుల లభ్యత, సాంకేతిక అనుమతులు క్షేత్రస్థాయిలో పెరిగిన వేగం చూస్తుంటే… నిర్ణీత గడువులోగా పోలవరం కల సాకారం కావడం ఖాయంగా కనిపిస్తోంది. గోదావరి జలాలు ఆంధ్రప్రదేశ్ పొలాలను తడిపే రోజు త్వరలోనే రానుంది.ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశాలాంధ్ర జిల్లా బ్యూరోలు, స్టాఫ్ రిపోర్టర్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్ట్ లో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ డీఈఈ బీ మల్లికార్జునరావు, ఏఈఈ జీ సురేశ్‌లు విశాలాంధ్ర బృందానికి నిర్మాణ పనులను వివరించారు.

విశాలాంధ్ర బ్యూరోసచివాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వరప్రదాయిని, బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. 2026 మార్చి నెల ప్రాజెక్టు చరిత్రలో కీలక మలుపుగా నిలవనుంది. సాంకేతిక సవాళ్లను సమర్థవంతంగా అధిగమిస్తూ... డ్యామ్ భద్రతకు అత్యంత కీలకమైన ‘డయాఫ్రమ్ వాల’ నిర్మాణం 98 శాతం పూర్తికావడం విశేషం. అటు ఇంజనీరింగ్ పనులు, ఇటు పునరావాస ప్రక్రియ రెండూ సమాంత రంగా, యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. జూన్ 2026 నాటికి ప్రధాన కాలువల అనుసంధానం, మార్చి 2027 నాటికి డ్యామ్ నిర్మాణం సంపూర్ణం చేయాలనే పక్కా లక్ష్యంతో యంత్రాంగం అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు మనుగడకు ప్రాణాధారమైన గ్యాప్2 లోని కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు ముగింపు దశకు వచ్చాయి. మొత్తం 67,116 చదరపు మీటర్లకు గాను ఇప్పటికే 65,316 చ.మీ (97 శాతం ) పనులు పూర్తయ్యాయి. మొత్తం 365 ప్యానెల్స్‌లో 338 ప్యానెల్స్ పూర్తయ్యాయి, కేవలం 27 ప్యానెల్స్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. డయాఫ్రమ్ వాల్ 1372.20 మీటర్ల పొడవుకు గాను 1333.00 మీటర్ల నిర్మాణం ముగిసింది. ఇది డ్యామ్ పటిష్టతకు పెద్ద ఊరట. గ్యాప్1 లో 12.83 లక్షల క్యూబిక్ మీటర్ల పనికి గాను 4.54 లక్షల క్యూ.మీ పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 31, 2026 నాటికి దీనిని పూర్తి చేయనున్నారు. గ్యాప్2 లో ఇసుక రీచ్ పనులు పురోగతిలో ఉండగా, క్లే రీచ్ డిజైన్లకు ఈ నెల మూడవ వారంలో సీడబ్ల్యూసీ నుండి తుది ఆమోదం లభించనుంది. దీనిని మార్చి 31, 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం.నీటి మళ్లింపుకు కీలకమైన పనులు తుది దశకు చేరాయి. కుడి వైపు జంట టన్నెల్స్ లైనింగ్ పనులు 68 శాతం పూర్తయ్యాయి. జూన్ 30, 2026 నాటికి ఇవి సంపూర్ణమవుతాయి. ఎడమ వైపు హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 66శాతం, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 64 శాతం వరకు పూర్తయ్యాయి. ఇవి కూడా జూన్ నెలాఖరుకు సిద్ధం కానున్నాయి.
పోలవరం జలవిద్యుత్ కేంద్రం
ప్రాజెక్టు అడుగున గోదావరి ప్రవాహ శక్తిని ఉపయోగించి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా దీనిని రూపొందిం చారు. మొత్తం 960 మెగావాట్ల విద్యుదు త్పత్తి సామర్థ్యంతో పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మిస్తున్నారు. ఇది దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. స్పిల్ వేకు పక్కన కొండను తొలిచి భారీ టన్నెల్స్ ద్వారా నీటిని టర్బైన్ల మీదకు పంపేలా పనులు జరుగుతు న్నాయి. రాష్ట్రానికి అవసరమైన పీక్ లోడ్ సమయంలో తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ అందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాలువల ద్వారా నీటిని తరలించడానికి కొన్ని చోట్ల భారీ ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల) పథకాలు కూడా అనుసంధానించబడ్డాయి. ముఖ్యంగా కుడి కాలువ ద్వారా నీటిని పంపడానికి పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి తాత్కాలిక పథకాలు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి.
పెరిగిన నిర్మాణ వ్యయం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినందున, నీటిపారుదల రంగానికి సంబంధించిన వ్యయాన్ని కేంద్రమే భరిస్తుంది.మొత్తం అంచనా వ్యయం సుమారు 55,548.87 కోట్లు (2017-18 ధరల ప్రకారం కేంద్రం ఆమోదించిన అంచనా). జాతీయ ప్రాజెక్టు కావడంతో 2014 ఏప్రిల్ 1 తర్వాత జరిగిన ఖర్చును కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోంది.
ఇటీవల కేంద్ర మంత్రివర్గం పోలవరం మొదటి దశ పూర్తి చేయడానికి అదనంగా దాదాపు 12,157 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. ఇది నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో కూడా భూ సేకరణ స్థానిక మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగింది.భూసేకరణ ప్రక్రియ 91.4 శాతం పూర్తి కావడం ప్రాజెక్టు వేగానికి అద్దం పడుతోంది. మార్చి 5, 2026 నాటికి ప్రాజెక్టుపై జరిగిన మొత్తం వ్యయం రూ. 26,597.09 కోట్లు. ఇందులో జాతీయ ప్రాజెక్టు హోదా వచ్చిన తర్వాతే రూ. 21,866.38 కోట్లు ఖర్చు చేశారు. కేంద్రం నుండి అందిన ముందస్తు నిధులలో రూ. 4,633.15 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే వినియోగించింది. ఈ గణాంకాలు ప్రాజెక్టు పనుల్లోని వేగాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సాంకేతిక లోపాలను సవరిస్తూ, నిధుల కొరత లేకుండా అడుగులు వేస్తున్న యంత్రాంగం, నిర్దేశిత గడువులోగా పోలవరం ఫలాలను రైతులకు అందించే దిశగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. పోలవరం ఇప్పుడు కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక. పనుల వేగం చూస్తుంటే 2027లో ఈ మహా యజ్ఞం పూర్తి కావడం తథ్యంగా కనిపిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *