యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం ;12వ పిఆర్సీని అమలు చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించే వరకు పోరాటం ఆగదని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్ ఎస్ ప్రసాద్, యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులు, రామక్రిష్ణ నాయక్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం లోని యూటిఎఫ్ కార్యాలయము నందు సత్యసాయి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ 12వ పిఆర్సీని అమలు చేయాలని యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. పిఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నదని, పిఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారం చేపట్టగానే 12వ పిఆర్సీని అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలను చెల్లిస్తామని పేర్కొన్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా పిఆర్సీని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. కనీసం పిఆర్సీ చైర్మన్ ను కూడా నియమించకుండా కాలయాపన చేయడం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలలో కేవలం 8500 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని, ఇంకా 30 వేల కోట్ల పైబడిన బకాయిలను ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏమిటని వారు నిలదీశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో, ప్రజలలో భాగమనే విషయాన్ని గుర్తెరిగి నడుచుకోవాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపక్ష హోదాలో హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారం చేపట్టాక ఇచ్చిన హామీని విస్మరించడం ఉద్యోగులను వంచించడమే అన్నారు.సిపిఎస్ రద్దు విషయంలో ఈ రెండేళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వారు తెలిపారు. . డిఏ లను ఎప్పటికప్పుడు చెల్లిస్తామని పేర్కొన్న కూటమి నేతలు, మూడు డిఏలను చెల్లించకుండా పెండింగ్లో ఉంచడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనాలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం తగదన్నారు. ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం కరుణ చూపడం లేదన్న విషయంస్పష్టమవుతున్నదన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన సరెండర్ లీవులు మూడేళ్లుగా చెల్లింపులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఉద్యోగుల పట్ల కఠిన వైఖరి అవలంబించిన పాలకులు ఏమయ్యారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఉద్యోగ, ఉపాధ్యాయులు పట్టం కడితే, ఉద్యోగుల పట్ల ఏ విజన్ కనపరచకపోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ 12వ పిఆర్సీని ఏర్పాటు చేయాలని, పిఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఆర్థిక బకాయిలను రోడ్ మ్యాప్ ప్రకటించి నిర్ణీత గడువులోగా చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో యూటీఎఫ్ సత్య జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ , జిల్లా గౌరవ అధ్యక్షుడు కే భూతన్న, రాష్ట్ర కౌన్సిలర్స్ శ్రీమతి మేరీ వర కుమారి , సి.తాహెర్ వలి, జిల్లా కార్యదర్శులు అమర్ నారాయణరెడ్డి, నరసింహప్ప, మల్లికార్జున ,నరేష్ కుమార్, రవి వర్ధన్ రెడ్డి, బాబు, నాగేంద్రమ్మ, లతా దేవి ,అడిట్ కమిటీ కన్వీనర్ సునీల్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.


