విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గరికపాటికి మన దేశంలో పౌష్టికాహార లోపం వంటి అంశాలు తెలియవో లేక తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసారో? వాస్తవము ఏమిటంటే భారతదేశంలో నేటికీ దాదాపు 35 నుండి నుండి 40 శాతము మంది పిల్లలు సరైన పౌష్టికాహారం అందక ‘స్టంటింగ్’ (వయసుకి తగ్గ ఎదుగుదల లేకపోవడం) ‘వేస్టింగ్’ (బరువు తక్కువగా ఉండటం) వంటి సమస్యలతో బాధపడుతున్నార అని, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 ప్రకారం భారత దేశం 123 దేశాలలో 102 వ స్థానంలో ఆందోళనకరమైన స్థితిలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత , పిల్లల హక్కు అన్నారు .దీన్ని హేళన చేయడం అంటే దేశ భవిష్యత్తును అవమానించడమేనన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి మన పొరుగు దేశాలు కూడా ఆకలి సూచీలో మనకంటే మెరుగైన ర్యాంకుల్లో ఉండటం గమనార్హం అన్నారు. కాబట్టి, పిల్లలకు అందించే కోడిగుడ్లు లేదా ఇతర పౌష్టికాహారం అనేది కేవలం ఒక సౌకర్యం కాదు అని, అది వారి ప్రాథమిక , చట్టబద్ధమైన హక్కు. ఆహారపు హక్కు అన్నారు.బడి పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పోషకాలతో కూడిన ఆహారం అందించడం అనేది చట్టబద్ధమైన హక్కు అన్నారు.. ఒక గుడ్డు కోసం పిల్లలు బడికి వస్తున్నారని మాట్లాడటం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు.పిల్లల పట్ల అసభ్యకర* పోలికలు,పిల్లల ఎదుగుదల గురించి లేదా వారు ఆహారం తీసుకునే విధానం గురించి మాట్లాడుతూ, శోభనం రాత్రి పెళ్ళికొడుకు వంటి అనైతిక ,అసభ్యకరమైన పోలికలు తీసుకురావడం గరికపాటి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పిల్లల మనస్తత్వంపై ,సమాజంపై ఇటువంటి మాటలు అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్నారు.కోడిగుడ్డు ఒక సంపూర్ణ ఆహారం. వైద్య శాస్త్రం ప్రకారం, ఎదుగుతున్న పిల్లలకు ప్రోటీన్లు , విటమిన్లు అందడానికి కోడిగుడ్డు ఒక చౌకైన ,అత్యుత్తమ మార్గమనీ ,దీనిపై వితండవాదం చేయడం వల్ల పేద పిల్లలకు అందే పోషకాలను అడ్డుకున్నట్టే అవుతుందన్నారు.పిల్లల హక్కులను కించపరుస్తూ, వారి పేదరికాన్ని హేళన చేస్తూ మాట్లాడిన గరికపాటి గారు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


