Last Updated:
ఆటిజం కేసులు పెరుగుతున్నాయని చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి డాక్టర్ రమేష్ కృష్ణ తెలిపారు. లక్షణాలు త్వరగా గుర్తించి, బిహేవియర్, స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా మార్పులు సాధ్యమవుతాయని సూచించారు.
ఈ మధ్యకాలంలో చిన్నారుల్లో ఆటిజం కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పీడియాట్రిషన్ డాక్టర్ రమేష్ కృష్ణ కీలక విషయాలు వెల్లడించారు. ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అని, ఇది పిల్లల మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపడంతో పాటు వారి సామాజిక కమ్యూనికేషన్ నైపుణ్యాలను దెబ్బతీస్తుందని తెలిపారు.
ఆటిజంలో ప్రధానంగా రెండు కీలక అంశాలు ఉంటాయని ఆయన వివరించారు. మొదటిది మెదడు అభివృద్ధికి సంబంధించిన సమస్యలు. రెండోది సామాజిక కమ్యూనికేషన్ లోపం. ఒక సంవత్సరం దాటిన తరువాత కూడా పిల్లలు కళ్లలోకి చూసి మాట్లాడకపోవడం, తల్లిదండ్రుల మాటలకు స్పందించకపోవడం, ఇతర పిల్లలతో కలిసిపోకుండా ఒంటరిగా ఆడుకోవడం, వయస్సుకు తగ్గ మాటలు మాట్లాడకపోవడం లేదా స్పీచ్ డిలే కనిపించడం వంటి లక్షణాలు ఉంటే అలక్ష్యం చేయకూడదని సూచించారు. పిల్లలు నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం కూడా ఒక సంకేతంగా భావించవచ్చని చెప్పారు.
18 నెలలు దాటిన తర్వాత కూడా పిల్లలు వస్తువులు ఇతరులతో పంచుకోకపోవడం, పెద్దలను అనుకరించకపోవడం, ఒకే పనిని మళ్లీ మళ్లీ గంటల తరబడి చేయడం, ఒకే లైన్లో అటూ ఇటూ గెంతడం, ఒకే వస్తువును ఎక్కువసేపు గమనించడం, చేతులతో పదేపదే ఒకే విధమైన కదలికలు చేయడం వంటి లక్షణాలు ఆటిజానికి సూచనలుగా ఉండవచ్చని తెలిపారు. సాధారణంగా ఈ లక్షణాలు 18 నెలల నుంచి 4 సంవత్సరాల మధ్య స్పష్టంగా కనిపిస్తాయని చెప్పారు.
ఆటిజానికి ప్రధాన కారణాలు జెనెటిక్ అంశాలు మరియు మెదడు అభివృద్ధికి సంబంధించిన బహుళ కారణాలేనని డాక్టర్ రమేష్ కృష్ణ వివరించారు. ఎక్కువ వయస్సులో తల్లిదండ్రులు సంతానం పొందినప్పుడు కూడా అవకాశాలు పెరగవచ్చని పేర్కొన్నారు. అయితే వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం వస్తుందనే అపోహ పూర్తిగా తప్పని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాలు పెట్టుకోకూడదని అన్నారు.
ఆటిజాన్ని ఒకే డాక్టర్ పూర్తిగా నిర్ధారించడం సాధ్యం కాదని, పీడియాట్రిషన్, స్పీచ్ థెరపిస్టు, సైకాలజిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్టులు కలిసి సమగ్రంగా పరిశీలించి చికిత్స అందిస్తారని తెలిపారు. ప్రధానంగా బిహేవియర్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ద్వారా పిల్లల్లో గణనీయమైన మార్పులు సాధ్యమవుతాయని చెప్పారు. ఆటిజానికి ప్రత్యేకమైన మందులు లేవని, కానీ హైపర్ యాక్టివిటీ లేదా నిద్ర సమస్యలు ఉంటే వాటికి అవసరమైన మందులు ఇస్తారని వెల్లడించారు.
లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత వేగంగా, సమర్థవంతంగా చికిత్స అందించవచ్చని, తల్లిదండ్రులు అపోహలకు లోనుకాకుండా వైద్యులను సంప్రదించడం అత్యంత ముఖ్యమని డాక్టర్ రమేష్ కృష్ణ సూచించారు. పిల్లల్లో చిన్నచిన్న మార్పులను గమనించడం, సమయానికి స్పందించడం వారి భవిష్యత్తును మార్చగలదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


