అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి రోట్లో తలదూర్చినట్టుగా ఉంది. ఇస్రాయెల్ పనుపున ఇరాన్ పై నిష్కారణ యుద్ధానికి దిగిన ట్రంప్ ఆ యుద్ధం విరమించే మార్గం తోచక బెంబేలెత్తిపోతున్నారు. రెండు వారాలకు పై నుంచి ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు ట్రంప్‌ని దిక్కు తోచని పరిస్థితిలోకి నెట్టేసింది. ఇస్రాయెల్ మీద, పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ తీర్చుకుంటున్న ప్రతీకారం అనూహ్య రీతిలో ఉంది. ఇరాన్ కనక దారి మార్చుకుంటే దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవడానికి తాము సిద్ధం అని భారత్‌లో ఇస్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ అంటున్నారు. దీన్నిబట్టి యుద్ధ రంగం నుంచి వెనుదిరగడానికి ఇస్రాయెల్, అమెరికా ఎంతగా ఆరాటపడ్తున్నాయో అర్థం అవుతోంది. ఇస్రాయెల్ ఈ యుద్ధానికి “గర్జించే సింహం” అని పేరు పెట్టింది. కానీ యుద్ధరంగ పరిస్థితి చూస్తే ఈ సింహం గోతిలో పడి లేవడం తెలియక సతమతం అవుతున్నట్టుగా ఉంది. యుద్ధంలో ప్రాణనష్టం ఎటూ ఉంటుంది. కానీ అసత్య ప్రచారం అంతకన్నా చాలా విపరీతంగా ఉంటుంది. ఇస్రాయెల్ అధినేత నెతన్యాహూ మరణించాడని, కాదు తీవ్రంగా గాయపడ్డారన్న వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఖండించడానికే రూవెన్ అజర్ దిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి నెతన్యాహూ సజీవంగానే ఉన్నారని చెప్పారు. నెతన్యాహూ ఒక కాఫీ హౌజ్‌లో కాఫీ తాగుతున్న వీడియో బాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ ఇస్రాయెల్ అధినేత ఎడం చేయి వాటం మనిషి. కానీ ఆయన కుడి చేత్తో కాఫీ పట్టుకున్నాడు కనక అది కృత్రిమ మేధస్సుని వినియోగించి తయారుచేసిన వీడియో అన్న వార్తలూ అంతే బాగా ప్రచారంలో ఉన్నాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెడ్తున్నారని అజర్ చెప్తున్నారు. అలాంటప్పుడు ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ ప్రయాణిస్తున్న విమానాన్ని పేల్చేశామని చెప్తున్న మాట కూడా యుద్ధ సమయంలో జరిగే అసత్య ప్రచారంలో భాగం అయి ఉండాలి. నెతన్యాహూ మృతి చెందాడు లేక తీవ్రంగా గాయపడ్డాడు అని వారం నుంచి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. అందుకే ఆయన ఆదివారం నాడు ఒక కేఫ్‌లో కాఫీ తాగుతున్న వీడియో విడుదల చేసినట్టున్నారు. మేం ఎప్పుడూ దౌత్య మార్గాన్నే ఎంచుకుంటాం అని కూడా అజర్ నొక్కి చెప్పారు. దౌత్యం ఫలించనందు వల్లే తాము యుద్ధానికి దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అదే నిజమైతే, ఇస్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌ను భస్మీపటలం చేస్తున్న దశలో అంటే విజయం సాధించే స్థితిలో ఉన్నప్పుడు దౌత్యం ఎందుకు గుర్తొచ్చినట్టో! ఇరాన్ దారి మార్చుకుంటే ఆ దేశం భవిష్యత్తు బంగారంలా ఉంటుందని అజర్ హామీ ఇస్తున్నారు. అసలు యుద్ధం మొదలుపెట్టడానికి కారణం ఏమిటో మాత్రం ఆయన చెప్పనే లేదు. ఇరాన్‌కు అణ్వస్త్రాలు తయారు చేసే స్తోమత లేదని ట్రంప్ స్వయంగా అనేక సార్లు చెప్పారు. అలాంటప్పుడు హఠాత్తుగా ఇరాన్ మీద యుద్ధానికి దిగవలసిన అగత్యం ఏమొచ్చినట్టు? కనీసం రెండు అమెరికా యుద్ధ విమానాలు యుద్ధ రంగం నుంచి ఎందుకు తప్పుకున్నట్టు? సోమవారం ఉదయం దుబై విమానాశ్రయం మీద ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. దీనితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. ఏర్ ఇండియాతో సహా ఏర్ కెనడా, ఏర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా, కె.ఎల్.ఎన్.లాంటి విమానయాన సంస్థలు కూడా దుబై నుంచి, దుబైకి విమానాలు నడపడం నిలిపివేశాయి. దుబై స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా నౌకాశ్రయంలో సరుకుల రవాణా ఆపేశారు. ఈ పరిస్థితిని వీడియో తీసినందుకు 19మంది భారతీయులతో సహా మొత్తం 35 మందిని అరెస్టు చేశారు. వీడియోలు తీసినందుకు ఖతార్‌లో 300 మందిని అరెస్టు చేశారు. అదేవిధంగా గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అనుమానంపై ఇరాన్లో 500 మంది నిర్బంధంలో ఉన్నారు. యుద్ధంలో గెలుపు తమదేనని చెప్పుకుంటున్న ట్రంప్ ఇతర దేశాల మద్దతు కోరే దుస్థితిలో చిక్కుకున్నారు. రెండు యుద్ధ విమానాలు పంపుతామని బ్రిటన్ అధినేత స్టార్మర్ గత ఏడో తేదీన ముందుకు వస్తే ఆయనను అపహాస్యం చేశారు. గెలుస్తున్న దశలో సాయం చేసే వారు తమకు అక్కర్లేదని తెగేసి చెప్పారు. ఇరాన్ హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలను అనుమతించడం లేదు. ఒంటరిగా ఇరాన్‌ను ధిక్కరించి హోర్ముజ్ ద్వారా నౌకలను నడిపించే ధైర్యం ట్రంప్‌కు ఉన్నట్టు లేదు. అందుకే చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డంతో పాటు ఇతర దేశాలు తమ యుద్ధ నౌకలను పంపితే అందరం కలిసి హోర్ముజ్ జలసంధి దాటేయొచ్చు అని ట్రంప్ అంటున్నారు. చైనా, రష్యా నౌకలను అడ్డగించబోమని ఇరాన్ ఇదివరకే ప్రకటించింది. గెలిచేశాం అని చెప్పుకుంటున్న ట్రంప్‌కు హోర్ముజ్ నుంచి తమ నౌకలను దాటించే ధైర్యం మాత్రం చిక్కడం లేదు. నిజానికి హోర్ముజ్ జలసంధి ద్వారా దిగుమతి చేసుకునే చమురు అమెరికా సేకరించే చమురులో ఒక్క శాతం కూడా ఉండదు. కానీ హోర్ముజ్ జలసంధిని రక్షించడానికి యుద్ధ నౌకలను పంపించాలని రెండు రోజుల నుంచి ట్రంప్ అభ్యర్థిస్తూనే ఉన్నారు. కానీ ఒక్క దేశం కూడా ఇంతవరకు ట్రంప్ మాట చెవిన పెట్టినట్టు లేదు. కొన్ని దేశాలు తమ ప్రయోజనాల పరిరక్షణకు యుద్ధ నౌకలను పంపడం గురించి ఆలోచిస్తామంటే ఆస్ట్రేలియ లాంటి దేశాలు ససేమిరా అంటున్నాయి. భారత్‌కు చెందిన గ్యాస్ ఉన్న రెండు నౌకలు మాత్రం హోర్ముజ్ జలసంధిని దాటి రాగలిగాయి. అయితే రావాల్సిన అన్ని నౌకలు ఇంకా రానే లేదు. ఒక్కో భారత నౌక రావడానికి విడివిడిగా ఇరాన్ అనుమతి తీసుకోవాల్సి ఉందంటున్నారు. జనం కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ రెండు నౌకలను మాత్రం హోర్ముజ్ నుంచి రానిచ్చింది. అది కూడా భారత ప్రజల కోసం అనుమతించామని ఇరాన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అంటే ఇది మోదీ ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసినందు వల్లో, విదేశాంగ మంత్రి జై శంకర్ దౌత్యం వల్లో కాదనుకోవాలి. అయతుల్లా ఖామేనీని హతమార్చడాన్ని, ఇరాన్ మీద దాడి చేయడాన్ని భారత్ ఖండించలేదన్న అభిప్రాయం ఇరాన్ అధినేత అన్యాపదేశంగా చెప్పనే చెప్పారు. హోర్ముజ్ నుంచి రాకపోకల కోసం భారత్ యుద్ధ నౌకలను పంపే ఆలోచనలో ఇంతవరకు లేదు. అదే జరిగితే ఆగిపోయిన నౌకలను అనుమతించడం దుర్లభమే అవుతుంది. యుద్ధం నుంచి ఎలా బయట పడాలన్నది ట్రంప్ అసలు సమస్య. కానీ యూరప్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలు, కడకు నాటో దేశాలు కూడా ట్రంప్ గోడు వినేట్టు లేవు.
The post పాపం ట్రంప్! appeared first on Visalaandhra.


