పాడి రైతుకు కష్టకాలం


*పతనమవుతున్న ధరలు
*పెరుగుతున్న పెట్టుబడి
*పశువులకు మేత కొరత

                              (విశాలాంధ్ర- చిత్తూరు)

చిత్తూరు జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు పట్టుగొమ్మ. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ జిల్లాలో లక్షలాది కుటుంబాలకు పశువులే జీవనాధారం. వ్యవసాయం కలిసిరాక, వర్షాభావ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య రైతుకు ‘పాడి’ ఒక ఆశాకిరణంగా నిలిచింది. కానీ, నేడు అదే పాడి పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల ఉదాసీనత మరోవైపు వెరసి.. పాడి రైతు బతుకు భారంగా మారింది.

మేత కొరత

ప్రస్తుత వేసవి కాలం పాడి రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎండల తీవ్రతకు పచ్చగడ్డి కరువైంది. చెరువులు, కుంటలు ఎండిపోవడంతో పశువులకు తాగడానికి నీరు, తినడానికి మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. గతేడాది వరకు రూ.120 పలికిన గడ్డి కట్ట ధర నేడు ఏకంగా రూ.300కు చేరింది. ప్రైవేటు మార్కెట్‌లో మేత ధరలు ఆకాశాన్ని తాకడంతో, పశువులను పోషించడం సామాన్య రైతు వల్ల కావడం లేదు. మేత సరిగ్గా లేకపోవడంతో పశువుల ఆరోగ్యం క్షీణించి, పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.

పెట్టుబడి కొండంత.. ఆదాయం గోరంత

పాడి పరిశ్రమలో పెట్టుబడి వ్యయం గత రెండేళ్లలో రెట్టింపు అయ్యింది. రైతు వాడే ప్రతి వస్తువు ధర పెరిగింది కానీ, అతను అమ్మే పాల ధర మాత్రం అక్కడే ఉంది. 45 కిలోల దానా బస్తా ధర రూ.1,500లకు చేరింది. గతంలో రూ.700 ఉన్న ఫీడ్ బస్తా ఇప్పుడు రూ.1,000 దాటిపోయింది. రూ.600 ఉన్న బూసా బస్తా రూ.900కి, కిలో రూ.50 ఉన్న గానుగ పిండి రూ.70కి పెరిగింది. గతంలో ఐదు లీటర్ల పాలిచ్చే పశువు రూ.40 వేలకు దొరికేది, కానీ ఇప్పుడు దాని ధర రూ.80 వేలకు పైమాటే. ఇంత పెట్టుబడి పెట్టి లీటరు పాలను కేవలం రూ.37కే విక్రయించాల్సి రావడం రైతును అప్పుల ఊబిలోకి నెడుతోంది. గిట్టుబాటు ధర లేక, చేసిన అప్పులు తీరక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
వ్యాధుల విజృంభణ – మందుల భారం

వేసవి తాపానికి తోడు పశువులకు రకరకాల వ్యాధులు సోకుతున్నాయి. సహజ ఎరువుల కొరత వల్ల కేవలం యూరియా వాడి పండించిన గడ్డిని తినడం వల్ల పశువులు తరచూ అనారోగ్యం పాలవుతున్నాయి. ఒకవైపు పశువుల మరణాలు రైతుకు కోలుకోలేని దెబ్బ తీస్తుంటే, మరోవైపు మందుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెరిగాయి. పశువైద్యం కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడం రైతు నడ్డి విరుస్తోంది.

డెయిరీల దోపిడీ

చిత్తూరు జిల్లా పక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని డెయిరీలు లీటరుకు రూ.5 నుంచి రూ.7 అదనంగా చెల్లిస్తున్నాయి. అక్కడ కొనుగోలు ధర రూ.40 వరకు ఉంటే, విక్రయ ధర రూ.60 వరకు ఉంది. కానీ జిల్లాలోని డెయిరీలు మాత్రం రైతుకు తక్కువ ధర ఇచ్చి, వినియోగదారుడికి మాత్రం పెరుగు, నెయ్యి రూపంలో భారీ ధరలకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాయి. డెయిరీల పక్షపాత ధోరణి వల్ల మధ్యవర్తులు బాగుపడుతుంటే, అసలైన కష్టజీవి అయిన రైతు మాత్రం ఆకలితో అలమటిస్తున్నాడు.

పాలకులు మేల్కొనేది ఎప్పుడు?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా కావడంతో పాటు, కుప్పం వంటి నియోజకవర్గాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. పాలకుల హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

పాడి రైతుల డిమాండ్లు

పాలకు కనీస గిట్టుబాటు ధరను లీటరుకు రూ.50 వరకు పెంచాలి. ప్రభుత్వమే సబ్సిడీపై మేతను, దాణాను పంపిణీ చేయాలి. ఉచిత పశువైద్య శిబిరాలు నిర్వహించి, మందులను అందుబాటులో ఉంచాలి. మరణించిన పశువులకు తక్షణమే బీమా పరిహారం చెల్లించాలి. పాడి పరిశ్రమ చితికిపోతే అది కేవలం రైతుల సమస్య మాత్రమే కాదు, జిల్లా ఆర్థిక వ్యవస్థకే ప్రమాదం. ఇప్పటికైనా పాలకులు కరుణించి, ఈ ‘శ్వేత విప్లవ’ వారధులను ఆదుకోకపోతే చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

The post పాడి రైతుకు కష్టకాలం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *