అవసరమైతే రాజీనామా చేస్తాను
జమ్మలమడుగు: పనులు జరగవంటే కుదరదు. పదవి తనకు ప్రధానం కాదని, ‘నేను అనుకున్నట్లు వ్యవస్థ సరిగా లేకపోతే పార్టీలోనే ఉండి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ప్రభుత్వ విప్, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. నూరు రోజుల కిందటే నిర్ణయించుకున్నానని చెప్పారు. స్థానిక రిపబ్లిక్ క్లబ్‌లో సోమవారం జరిగిన ‘మన ఊరు – మన జెండా’ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, మంత్రిగాను పనిచేశానని అన్నారు. అన్ని పనులు కచ్చితంగా జరగాలి. అభివద్ధి పనులకు ఎక్కడా ఆటంకం జరగరాదని ఆయన స్పష్టం చేశారు. గండికోట జలాశయ ముంపువాసుల త్యాగం చేయడం వల్లే గండికోట ఆనకట్ట నుంచి తాడిపత్రి, పైడిపాలెం, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైలవరానికి నీళ్లు వస్తున్నాయన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడతానని అని అన్నారు. రాజోలి నిర్మాణం, గండికోట ముంపువాసులకు మిగిలిన పరిహారం, శ్రీశైలం కుడి కాలువ నిర్మాణ పనులు, ఆర్టీపీపీలో ఉద్యోగ అవకాశాల సమస్యలపై పోరాడుతున్నట్లు తెలిపారు. వీటితోపాటు ఇంకా కొన్ని రాజకీయ సమస్యలున్నాయన్నారు. ఏమైనా తేడా వస్తే తనకు పార్టీ పదవుల కంటే ప్రజలే ముఖ్యం… రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. మంచికి మంచి చేయకపోతే పార్టీ బలపడదన్నారు. వైసీపీ హయాంలో తనపై ఎన్నో కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. తాను ఎక్కడా తగ్గలేదన్నారు. వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకోలేన్నారు.


