. ముందుకు రాని ప్రభుత్వం
. పోడియం చుట్టుముట్టిన ప్రతిపక్ష సభ్యులు
. ఈలలు, నినాదాలతో గందరగోళం
. టీడీపీ సభ్యుల నిరసనలు
. ఇందాపూర్ నెయ్యిపై ఆగని రగడ
. వాయిదాలతో నడిచిన మండలి
. అచ్చెన్నాయుడు వర్సెస్ బొత్స
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: తిరుపతి లడ్డూ తయారీకి ఇందాపూర్ నెయ్యి సరఫరాపై శాసనమండలిలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చకు ప్రతిపక్ష వైసీపీ పట్టుబడుతుండగా… అధికార పక్షం మాత్రం ససేమిరా అంటున్నది. ఈ వివాదంపై మాటలయుద్ధం జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో శాసనమండలి దద్దరిల్లింది. శాసనమండలి సమావేశాలు గురువారం కూడా అత్యంత ఉత్కంఠభరితంగా, తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. హెరిటేజ్ డెయిరీ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందన్న అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. శాసనమండలి ప్రారంభంలో చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా సాగేందుకు ఇరు పక్షాలు సహకరించాలని కోరుతూ… వివిధ ప్రభుత్వ బిల్లులు చదివి ఆమోదింపజేశారు. అనంతరం హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసిన కల్తీ నెయ్యిపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు వరుదు కల్యాణి, రామసుబ్బారెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ సమర్పించిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా చైర్మన్ పోడియం వద్దకు దూసుకొచ్చి ప్లకార్డులు చేతబట్టి ‘కల్తీ.. కల్తీ హెరిటేజ్ నెయ్యి’, ‘కల్తీ.. కల్తీ హెరిటేజ్ పాలు’ అంటూ నినాదాలు చేశారు. దీనికి పోటీగా టీడీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకొని నిరసన తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ… ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, దీని గురించి ప్రభుత్వం తరపున ఇప్పటికే స్పష్టం చేశామని, ఒకవేళ సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారమైనా చూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హెరిటేజ్‌పై సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారని మంత్రి మండిడ్డారు. దీనికి స్పందించిన బొత్స అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, చర్చకు ముందుకు వస్తే వాటిని సమర్పిస్తామని స్పష్టంచేశారు. వైసీపీ సభ్యులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. మొండితోక అరుణ్ కుమార్, భరత్, రమేశ్ యాదవ్, ఇజ్రాయేలు తదితరులు చైర్మన్ పోడియం పైకి ఎక్కి ప్లకార్డులతో నిరసన తెలుపగా… మిగిలిన సభ్యులు పోడియం ముందు నిలుచుని ఈల వేస్తూ హంగామా సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలకు చైర్మన్ అవకాశం కల్పించగా… పీఎంఏవై(జీ) 2.0 కింద గహాల అంశంపై టీడీపీ సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా) అడిగిన ప్రశ్నకు గహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిరసనల మధ్యే సమాధానమిచ్చారు. వైసీపీ సభ్యులు మాత్రం పోడియం పైకి ఎక్కి ఆందోళనలు కొనసాగించడంతో సభ మళ్లీ వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలను డీమ్డ్‌గా ప్రకటించి… బడ్జెట్‌పై చర్చ కొనసాగింపునకు చైర్మన్ ప్రయత్నించారు. అప్పటికే పోడియం చుట్టూ, పోడియంపైన ఉన్న వైసీసీ సభ్యులు… ఈలలు వేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో శుక్రవారం ఉదయం10 గంటలకు సభను చైర్మన్ వాయిదా వేశారు.
ఇందాపూర్‌తో హెరిటేజ్‌కు సంబంధం లేదు: అచ్చెన్నాయుడు
వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ… ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజీ సంస్థకు సంబంధం లేదని, చీజ్ ప్యాకెట్‌కు నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. మూడు రోజులుగా ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తున్నా… కావాలనే సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మంత్రి అన్నారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని అసత్య ప్రచారం చేస్తున్నారని, సీనియర్ సభ్యుడిగా ఆయనకు ఆ మాత్రం అవగాహన లేకపోవడం విచారకరమని విమర్శించారు. హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు ఇచ్చినా వైసీపీ తీరు మారడం లేదని, తిరుమల కల్తీ నెయ్యి వివాదం నుంచి దారిమళ్లొంచేందుకు హెరిటేజ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ మాదిరిగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడలేదన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ వ్యాపారం చేయబోమని ఆ సంస్థ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ మనస్తత్వంతో ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని, ఆధారాలుంటే సభలో చర్చించాలని, లేకుంటే ఆటంకం కలిగించే సభ్యులపై చైర్మన్ కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
హెరిటేజ్ షేర్ వాల్యూ రూ.700కు ఎలా వెళ్లింది: బొత్స
బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇందాపూర్ నెయ్యి సరఫరాపైన, తిరుపతి లడ్డూపైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం ఏడాది కాలంలో హెరిటేజ్ షేర్ వాల్యూ రూ.300 నుంచి రూ.700కు ఎలా పెరిగిందని నిలదీశారు. షేర్ మార్కెట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ దోపిడీ కోసం ప్రసాదంలో కొవ్వు కలిసిందని ప్రచారం చేశారని, చర్చకు రమ్మంటే తిరిగి బెదిరించాలని చూస్తున్నారని బొత్స మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తోపాటు కూటమి నేతలు దేవుడిపై నిందలేసి మహా పాపం చేశారన్నారు. సాక్ష్యాలు ఉంటే చర్చకు రమ్మంటున్నారని, చర్చ చేస్తే సాక్ష్యాలు బటయకు వస్తాయన్నారు. ఇందాపూర్ నెయ్యి సరఫరాపై తాము చెప్పేది వాస్తవమో, అవాస్తవమో హెరిటేజ్ వెబ్‌సైట్‌ను చూస్తే తెలుస్తోందన్నారు. హెరిటేజ్ నుంచి తనకు ఎలాంటి నోటీసు రాలేదన్నారు.
The post పట్టువీడని వైసీపీ appeared first on Visalaandhra.


