Last Updated:
కాకినాడ జిల్లా సామర్లకోటలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి ఇంట్లో 250 గ్రాముల బంగారం రెండు కేజీలకు పైగా వెండి దొంగిలింపు ఎండాకాలం తాళం ఇళ్లపై హెచ్చరిక.
సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి దొంగల ఆగడాలు పెరుగుతుంటాయి.. సెలవులు, శుభకార్యాల కోసం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నప్పటికీ, నిర్లక్ష్యం వల్ల చోరీలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బయటకు కనిపించేలా తాళం వేయడం దొంగలకు సంకేతంగా మారుతుందని పోలీసులు చెబుతున్నారు. పగటిపూట ఇళ్లను గమనించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది.
ఇలాంటి ఘటన తాజాగా కాకినాడ జిల్లా సామర్లకోటలో చోటుచేసుకుంది. స్థానిక అంబటి వారి తోట ప్రాంతంలో నివసించే రిటైర్డ్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. ఇటీవలే ఆమె తన బంగారం లాకర్ నుంచి తీసుకువచ్చి ఇంట్లో ఉంచారు. బంధువుల వివాహానికి వెళ్లే సమయంలో కొంత బంగారం ధరించి, మిగతాదాన్ని ఇంట్లోనే ఉంచి వెళ్లారు.
వివాహం అనంతరం ఆమెకు అనారోగ్యం రావడంతో మరికొన్ని రోజులు బయటే ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి ఆభరణాలు అపహరించి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
సమాచారం అందుకున్న బాధితురాలు మరుసటి రోజు ఇంటికి చేరుకుని పరిస్థితిని చూసి లబోదిబోమంటున్నారు. సుమారు 250 గ్రాముల బంగారం, రెండు కేజీలకు పైగా వెండి పోయిందని ఆమె తెలిపారు. సాధారణంగా బంగారం లాకర్‌లోనే ఉంచేదాన్నని, ఈసారి పెళ్లి కారణంగా ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దొంగిలించిన ఆభరణాలను పోలీసులు తిరిగి రికవరీ చేయాలని కోరుతున్నారు.
ఈ ఘటనతో మరోసారి తాళం వేసిన ఇళ్లపై దొంగల కన్ను ఉంటుందన్న విషయం స్పష్టమైంది. ఒకటి రెండు రోజులు ఇల్లు మూసి ఉంటేనే దుండగులు గమనించి టార్గెట్ చేస్తారని పోలీసులు చెబుతున్నారు. అందుకే బయటకు తాళం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పొరుగువారికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
మొత్తంగా ఎండాకాలం, సెలవుల సమయంలో ఇళ్ల భద్రతపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


