. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాకు ఆటంకం రానివ్వొద్దు
. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో రాష్ట్రంలో సంభవించిన పంట నష్టంపై రెండు రోజుల్లో పూర్తిస్థాయి అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై శుక్రవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా లెక్కగట్టారు. అలాగే 9 జిల్లాల్లోని 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో ఉద్యాన పంటలపైనా వర్షాలు ప్రభావం చూపాయన్నారు. అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినగా… వీటి నష్టం విలువ రూ.23 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటివరకు వేసిన అంచనాల ప్రకారం అన్ని పంటలకు కలిపి మొత్తం నష్టం రూ.63 కోట్లుగా అధికారులు లెక్క తేల్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సూచించారు. మరోవైపు ఎల్పీజీ సరఫరాపైనా సీఎం సమీక్షించారు. ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా మధ్య మరి కొన్నాళ్లు యుద్ధం కొనసాగితే… ఎల్పీజీ గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినే అవకాశం ఉందని, ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనేలా రాష్ట్రంలో సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సీఎం అధికారులకు సూచించారు. ఎక్కడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం రానివ్వకుండా చూడాలన్నారు. గ్రామీణ- గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలు, అన్న క్యాంటీన్లు, అంగన్వాడీలకు గ్యాస్ డెలివరీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎరువులు, పెట్రోల్, డీజిల్‌కు లోటు రానివ్వకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
గోదావరిలో విద్యార్థుల
గల్లంతుపై ఆరా
పోలవరం జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద గోదావరిలో విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. స్నానం చేసేందుకు ఏడుగురు విద్యార్థులు గోదావరిలోకి దిగారని, వారిలో ఐదుగురు గల్లంతయ్యారని అధికారులు వివరించారు. గల్లంతైన వారిలో అభిరామ్, శ్రీకర్, నవదీప్ అనే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారని, మిగిలి ఇద్దరు విద్యార్థులైన సతీష్ కుమార్, తేజ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీపక్, హర్ష ప్రాణాలతో బయటపడ్డారని వివరించారు. విద్యార్థులంతా అమరావతిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన వారని తెలిపారు. ఆచూకీ లభ్యం కాని ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.


