. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు
. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు
విశాలాంధ్ర – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 142 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. తనిఖీల్లో రూ.3 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. బుధవారం పోలింగ్ జరగనుండగా… శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 14న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ , డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. చివరగా ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, ప్రత్యేక సమావేశంతో ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో 2,996 వార్డులకు 8,203 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 25,62,639 కాగా, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ ఎన్నికల్లో కీలక పరిణామంగా కనిపిస్తోంది. వీరితో పాటు మరో 640 మంది ఇతర ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల కోసం 16,031 బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేశారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు 1,379 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, 1,547 మంది సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. క్షేత్రస్థాయిలో 9,560 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 31,428 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరచడానికి 137 స్ట్రాంగ్ రూమ్‌లు, ఫలితాల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 25,000 మంది పోలీసు సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు.
The post నేడే మున్సిపోల్స్ appeared first on Visalaandhra.


