-ఇంగ్లాండ్ ను ఢీకొంటున్న భారత్
ముంబై: టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కఠిన సవాల్‌కు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను టీమ్ఇండియా ఢీకొట్టనుంది. రెండు జట్లు సెమీస్ చేరిన తీరు భిన్నం. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచినా.. సాధికారిక ప్రదర్శన చేయలేకపోయింది. సూపర్-8లో తడబడింది. దక్షిణాఫ్రికా చేతిలో పరాభవంతో గట్టి పరీక్షను ఎదుర్కొంది. చివరికి క్వార్టర్‌ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ముందంజ వేసింది. అదే సమయంలో ఇంగ్లాండ్ మంచి ఫామ్‌లో ఉంది. సూపర్-8లో ఆఖరి మ్యాచ్ ఆడడానికి ముందే ఆ జట్టు సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. అయితే ఇంగ్లాండ్ ఫామ్‌లోనే ఉన్నా.. ఆ జట్టుపై పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు మంచి రికార్డు ఉంది. ఈ రెండు బలమైన జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. సూపర్-8లో ఆట చూస్తే ఆ దశలోనే నిష్క్రమణ ఖాయమనిపించినా.. సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఎలాగోలా గట్టెక్కేసింది. ఫేవరెట్‌గా టోర్నీలో అడుగు పెట్టినా, ఇప్పటిదాకా సాధికారిక ప్రదర్శన చేయని భారత్.. సెమీస్‌లోనూ ఇలాంటి ఆటతోనే ముందంజ వేయాలంటే కష్టం. అదిరే ఫామ్‌తో ప్రపంచకప్‌లో అడుగు పెట్టి, సూపర్-8లో అజేయంగా నిలిచిన ఇంగ్లాండ్‌తో పోరంటే ఆషామాషీగా ఉండదు. సూర్యకుమార్ సేన.. టాప్ ఫామ్‌ను అందుకుంటే తప్ప ఫైనల్లో చోటు దక్కదు. మరి బ్యాటింగ్ యోధులు ఇప్పుడైనా అంచనాలు అందుకుంటారా? బౌలింగ్ వీరులు నిలకడ సాధిస్తారా? మొత్తంగా భారత్ సమష్టి ప్రదర్శనతో సెమీస్ గండాన్ని అధిగమిస్తుందా లేదా అనేది చూడాలి.
ముంబయి


