నేటి నుంచి దుకాణాల వేలం


అందుబాటులో 36 కాలనీల్లో 1400 షాపులు

విశాలాంధ్ర – హైదరాబాద్: భాగ్యనగరంలోని క్యూర్ పరిధిలో డబుల్ బెడ్ రూం కాలనీల్లో ఉన్న 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేల ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ఈ నెల 21 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 36 కాలనీల్లో ఉన్న దుకాణాలను వేలం ద్వారా విక్రయించడానికి ఆయా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీచేశారు. తొలుత రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది కాలనీల్లో 273 షాపులకు గురు, శుక్రవారాల్లో వేలం నిర్వహించనున్నారు. వందలాది కుటుంబాలు నివసించే కాలనీల్లో, స్థానికుల అవసరాలకు అనుగుణంగా వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకునేలా 60-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణాలను నిర్మించారు. వీటిని ఉన్నవి ఉన్నట్లుగా అన్న ప్రాతిపదికన విక్రయిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. కనీస ధరలను బహిరంగ మార్కెట్ కంటే తక్కువగా నామమాత్రంగానే నిర్దారించారు. ఆసక్తి ఉన్న వారు ఆయా కాలనీలను సందర్శించి, తమకు నచ్చిన, అనువైన దుకాణాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు నిర్ణీత మొత్తం ధరావతు (ఇంఎండి)తో వేలం నిర్వహించే తేదీల్లో ఉదయం గం.11.00లోగా సంబంధిత ఆర్డీవో కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కాలనీల నిర్వహణకు వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. తొమ్మిది, 10 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది కాలనీల్లో 273 దుకాణాలకు, 15, 16 తేదీల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 10 కాలనీల్లోని 77 దుకాణాలకు, 15, 17 తేదీల్లో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 12 కాలనీల్లోని 892 షాపులకు , సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆరు కాలనీల్లోని 372 షాపులకు 15 నుంచి 18 వరకు, 21న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. అదనపు సమాచారం కోసం ఆయా జిల్లాల హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ లను సంప్రదించవచ్చని ఎండీ వీపీ గౌతం సూచించారు.

The post నేటి నుంచి దుకాణాల వేలం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *