నేటి నుంచి అసెంబ్లీ – Visalaandhra


గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ నిర్ణయం

విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు 164 మంది, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. దీంతో శాసనసభ నిండుగా కనపడనుంది. కాగా గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని ప్రతిపక్ష వైసీపీ నిర్ణయించింది. బుధవారం ఉదయం 10 గంటలకు శాసన సభ, శాసన మండలి సభ్యులను ద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. సరిగ్గా 10.05 కి గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. గంటకు పైగా గవర్నర్ ప్రసంగం కొనసాగనుండగా… ఆ తర్వాత బిజినెస్ అడ్వైజర్ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ప్రవేశ పెట్టనున్న బిల్లులు తదితర అంశాలపై చర్చిస్తారు. 18 నుంచి 20 వర్కింగ్ డేస్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను ఈ నెల 14 న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. కాగా, గత రెండు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ప్రతిపక్ష వైసీపీ ఈసారి గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరుకావాలని నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరుకానున్నారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుంటే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణరాజు పదే పదే చేస్తున్న వాఖ్యల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం కీలకంగా భావించవచ్చు. మరోపక్క వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం శాసన మండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక వైసీపీ శాసనసభా పక్షం సమావేశం తర్వాత మిగిలిన రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అనే విషయం పై ఆ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చలో వైసీపీ పాల్గొంటుందా? లేదా అనేది చూడాలి. దీనిపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. మరోవైపు సూపర్‌సిక్స్ సహా వివిధ సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని అమరావతి నిర్మాణం తదితర కీలక అంశాలపె కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చించే అవకాశాలున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *