భారత్-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.నరవణె జ్ఞాపకాలపై చర్చచేపట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ల మధ్య బడ్జెట్ సెషన్ మొదటి దశ శుక్రవారంతో ముగిసింది. సభ మార్చి 9న తిరిగి సమావేశం కానుంది. మూడు వారాల విరామ సమయంలో బడ్జెట్లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయింపులను స్టాండింగ్ కమిటీలు పరిశీలించనున్నాయి.శుక్రవారం సభ ప్రారంభం కాగానే కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నినాదాలు చేయడంతో సభ గంటసేపు వాయిదా పడింది. భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కూడా ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో జనవరి 28న బడ్జెట్ సెషన్ మొదటి దశ ప్రారంభమైంది. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం 2020 నాటి భారత్-చైనా ఘర్షణకు సంబంధించి నరవణె జ్ఞాపకాల పుస్తకంలోని కొన్నివిషయాలను ఉటంకిస్తూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవడంతో ఫిబ్రవరి 2 నుండి సభ పదేపదే వాయిదా పడింది. సిపిఐ(ఎం) సభ్యుడు సహా ఏడుగురు కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఒకదశలో నిరసనలు ఇలాగే కొనసాగుతుండటంతో ప్రధానిని సభకు రావద్దని తానే సూచించానని స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని సమాధానం చెప్పకుండానే లోక్సభ ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యసభలో ప్రదాని ప్రసంగం ప్రతిపక్షాలపై విమర్శలతో సాగింది. స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.


