నెలకు 300 యూనిట్లు ఫ్రీ.. పేదలకు భారీ గిఫ్ట్.. ఫ్రీ సోలార్ ప్యానెల్స్‌తో పెద్ద మార్పు..! PM Surya Ghar Muft Bijli Yojana. |


Last Updated:

శ్రీ సత్య సాయి జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ప్రారంభం, కదిరిలో 1750 ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సోలార్ ప్యానెల్స్, నెలకు 300 యూనిట్లు ఫ్రీ విద్యుత్, సబ్సిడీతో రుణాలు అందుబాటులో

+

రాష్ట్రంలోనే

రాష్ట్రంలోనే మొదటి పీఎం సూర్య ఘర్ గ్రామం …

రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా శ్రీ సత్య సాయి జిల్లాలో పేద కుటుంబాలకు వెలుగునిచ్చే కీలక కార్యక్రమం ఆరంభమైంది. కదిరి రూరల్ మండలం సున్నపుగుట్ట తండా గ్రామంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచిత సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్‌ను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న విద్యుత్ భారం తగ్గించడమే కాకుండా, భవిష్యత్తులో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం లక్ష్యంగా ఉంది.

కుమ్మరవాండ్లపల్లి గ్రామ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, నాయకులు భారీగా హాజరయ్యారు. ఈ పథకం కింద కదిరి నియోజకవర్గంలో మొత్తం 1750 మంది ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇళ్లపై ఏర్పాటు చేసే ఈ ప్యానెల్స్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందే అవకాశం ఉండటంతో ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధి వైపు నడిపించే కీలక కార్యక్రమంగా నిలుస్తోంది. సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భారీగా ఆర్థిక సహాయం అందించడం కూడా ఈ పథకానికి ప్రధాన ఆకర్షణగా మారింది. 1 కిలోవాట్ సిస్టమ్‌కు సుమారు ₹30,000, 2 కిలోవాట్‌కు ₹60,000, 3 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువకు గరిష్టంగా ₹78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.

ఇళ్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించుకుని, మిగిలినదాన్ని గ్రిడ్‌కు విక్రయించే అవకాశం ఉండటం ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గం కూడా ఈ పథకం కల్పిస్తోంది. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రుణాలు కూడా అందుబాటులో ఉండటంతో మరింత మంది ఈ పథకం వైపు ఆకర్షితులవుతున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి సీజీఎం సంపత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణదేవ్, ఏడి శీనా నాయక్, ఏఈ శ్రీనివాసులు నాయక్ తదితర అధికారులు, అలాగే బీజేపీ, జనసేన, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఇళ్లను విద్యుత్ పరంగా స్వయం సమృద్ధిగా మార్చుకోవాలని అధికారులు సూచించారు. ఆన్‌లైన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకునే వీలుండగా, అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ పథకం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు, పేద కుటుంబాల ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *