నిప్ప్పుతో చెలగాటం వద్దు


. మా మాట వింటేనే దాడులు ఆపుతాం
. నమ్మకం కుదిరితేనే శాంతి చర్చలు
. అమెరికా`ఇజ్రాయిల్‌కు మద్దతిస్తే ప్రతీకారమే
. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక

తెహ్రాన్/వాషింగ్టన్/తెలఅవీవ్:
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం మొదలై నెల రోజులైంది. వైమానిక దాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా దీటుగా ప్రతిఘటిస్తూ, ప్రతి దాడులతో ఇజ్రాయిల్గల్ఫ్‌ను బెంబేలెతిస్తోంది. తమ మాట వినకపోతే శాంతిని మర్చిపోవల్సిందేనని హెచ్చరిస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేస్తే తప్ప దాడులు ఆపబోమని తేల్చి చెబుతోంది. అయితే ఇరాన్‌ను లొంగదీసుకోవడం కోసం అమెరికా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. భూతల దాడులకు సైతం అంటూ అదనపు బలగాలను రంగంలోకి దింపుతోంది. అనుకున్న దాని కంటే ముందుగానే తెహ్రాన్‌ను బలహీనం చేశామని ప్రకటనలు ఇచ్చుకుంటోంది. కీలకమైన జల మార్గం హోర్ముజ్‌ను ఇరాన్ మూసివేయడంతో అమెరికాకు మిత్రపక్షాలుగా ఉన్న దేశాలు ఏకతాటిపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. అయితే తాము దాడి చేస్తే ఇరాన్‌లో నాయకత్వం మారిపోతోందని అమెరికాఇజ్రాయిల్ వేసుకున్న అంచనా తారుమారైంది. అక్కడి అధికార పక్షానికి ప్రజలపై పట్టు ఏ మాత్రం సడలలేదు. కీలక నాయకులను కోల్పోయినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకుండా… అమెరికా`ఇజ్రాయిల్ దాడులను ప్రతిఘటిస్తోంది.12 ఏళ్ల పిల్లలు సైతం సైన్యంలో చేరే విధంగా అక్కడి ప్రజలు తమ శౌర్యాన్ని చాటుకుంటుండటం కొసమెరుపు. ఇదిలావుంటే, నెల రోజులుగా యుద్ధం చేస్తున్నాగానీ ట్రంప్ అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరలేదు. అంచనాలు తారు మారు కావడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ముందుకెళ్లలేక… వెనక్కు తగ్గలేక.. ..అయోమయ పరిస్థితుల్లో ఏప్రిల్ 6 వరకు ఇంధన కేంద్రాలపై దాడులు చేయమని ట్రంప్ ప్రకటించారు. రాజీ కోసం ఇరాన్ బతిమాలుకుంటోందని చెప్ప్పుకుంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. త్వరలోనే యుద్ధాన్ని ముగిస్తామని ప్రకటించారు. లక్ష్యాలను పూర్తిగా సాధించేందుకు భూతల దాడుల అవసరం లేదని, ఇరాన్ సైన్యం బలహీనమైపోయిందని చెప్ప్పుకుంటున్నారు. ఇరాన్‌ను మరింతగా రెచ్చగొట్టేందుకు ఆ దేశ నూతన అధినేత ముజ్తబా ఖామేనీ ప్రాణాలతో ఉండివుండరంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు ఎనిమిది యుద్ధాలు ఆపిన శాంతి దూతగా గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు. పాక్ దౌత్యానికి ప్రయత్నిస్తున్న క్రమంలో సౌదీ, ఈజిప్టు, టర్కీ దేశాల విదేశాంగ మంత్రులకు ఇస్లామాబాద్ ఆతిథ్యమివ్వబోతోంది.
ఆగని దాడులు: గల్ఫ్‌కు హెచ్చరికలు
శనివారం అమెరికా- ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, గల్ఫ్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాల్లో దాడులు ఆగాలన్నా, శాంతి నెలకొనాలన్నా తాము చెప్పినట్లు వినాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తమ గగనతలాలను వినియోగించుకోవడానికి అమెరికా, ఇజ్రాయిలకు అనుమతి ఇవ్వరాదని బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ దేశాలకు సూచించారు. ఏ దేశంపైనా ముందస్తు దాడులు చేయంగానీ మా మౌలిక సదుపాయాలు, అణు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. శత్రు స్థావరాలు భూస్థాపితమయ్యే వరకు విశ్రమించమన్నారు. తమ శత్రువులకు సహకరించినా వదలమని అన్నారు. నమ్మకం కుదిరితేనే శాంతి దిశగా చర్చలు పురోగించగలవని పాకిస్థాన్ దౌత్య ప్రయత్నాల క్రమంలో పెజెష్కియాన్ తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్‌తో ఫోన్ చర్చలు జరిపారు. సౌదీలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడిలో సైనికులకు గాయాలు కాగా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి.సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ దాడిలో యూఎస్ రీఫ్యూయెలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైందని అక్కడి సైన్యం ప్రతినిధులు తెలిపారు. 10 దళాలకు చెందిన సైనికులు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఉపగ్రహం ఒకటి ప్రచారంలోకి వచ్చింది. క్షిపణులతో పాటు, మానవరహిత డ్రోన్లతో ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. యుద్ధంలో ఇప్పటివరకు అమెరికాకు సంబంధించి 300 మంది గాయపడ్డారని, వీరిలో చాలా మంది కోలుకుని తిరిగి విధుల్లో చేరారని సమాచారం. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడితో అక్కడి రాడార్ వ్యవస్థ దెబ్బతిన్నది.
120కుపైగా క్లస్టర్ బాంబులు నిర్వీర్యం
అమెరికాఇజ్రాయిల్ వైమానిక దాడుల క్రమంలో దక్షిణ ప్రావిన్స్‌పై పడి, పేలని 120కుపైగా కస్టర్ బాంబులను నిర్వీర్యం చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్సొ వెల్లడించింది. షిరాజ్ సహా అనేక పట్టణాల్లో 122 క్టస్టర్ బాంబులను గుర్తించి, ధ్వంసం చేసినట్లు తెలిపింది. యుద్ధం ఆపేందుకు దౌత్య పరంగా జరుగుతున్న తాజా ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నట్లు టర్కీ విదేశాంగ మంత్రితో జరిపిన ఫోన్ సంభాషణలో ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ తెలిపారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులతో జెరూసలేంలో రెండు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రెండు పౌర అణు కేంద్రాలు, స్టీల్ ఫ్యాక్టరీలపై దాడులకు ఇజ్రాయిల్ భారీ మూల్యం చెల్లించుకోవాలని అరాగ్చీ హెచ్చరించారు. నిప్ప్పుతో చెలగాటం వద్దని తేల్చిచెప్పారు. సౌదీ యువరాజుతో మోదీ చర్చ సౌదీ అరేబియా యువరాజు, ప్రధాని మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై చర్చించారు. స్వేచ్ఛా నౌకాయానం, షిప్పింగ్ మార్గాలు తెరవడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించారు. సౌదీలోని భారతీయుల సంక్షేమానికి అందిస్తున్న నిరంతర సహకారానికిగాను ఆయన యువరాజు సల్మాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. యెమెన్ నుంచి ఇజ్రాయిల్‌పై దాడి యెమెన్ నుంచి తమ వైపు ఒక క్షిపణి దూసుకొచ్చిందని, దానిని అడ్డుకున్నామని ఇజ్రాయిల్ తెలిపింది. ఇటువంటి క్షిపణి ప్రయోగం ఇదే మొదటిసారని తెలుస్తోంది. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై మళ్లీ దాడి: ఐఏఈఏ ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై కేవలం పది రోజులలో మూడో దాడి జరిగింది. ఈమేరకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. రియాక్టర్‌కు నష్టం జరగలేదని, రేడియేషన్ విడుదల కాలేదని పేర్కొంది. ‘బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం ప్రాంతంలో కొత్తగా దాడి జరిగినట్లు ఐఏఈఏకు ఇరాన్ సమాచారం ఇచ్చింది. ప్లాంట్ పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపింది. విద్యుత్ కేంద్రం సమీపంలో సైనిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు వచ్చిన తాజా నివేదికలపై డీజీ రాఫెల్ మరియానో గ్రోస్సీ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. అణు ప్రమాదం నివారించడానికి సంయమనం పాటించాలని ఆయన సైన్యానికి పిలుపునిచ్చినట్లు ఐఏఈఏ వెల్లడించింది. అది ట్రంప్ జల సంధి: అమెరికా అధ్యక్షుడి వ్యంగ్యం ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్‌ను ‘ట్రంప్ జలసంధి’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని, సానుకూల ఫలితం ఆశిస్తున్నామన్నారు. ‘ట్రంప’ జలసంధిని తెరవాలని, అదే హోర్ముజ్... ఓ పొరపాటు జరిగింది. క్షమించండి’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యుద్ధం ముగించాలంటే ఈ జలసంధిని తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక శక్తిని కోల్పోయిందని, అణు కార్యక్రమం కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ అన్నారు. అమెరికా ఎప్ప్పుడు నాటోకు సాయం చేస్తుంది కానీ, ఆయా దేశాలు అమెరికాకు సాయం చేసేందుకు ముందుకు రాలేదన్నారు. వెనిజులా, ఇరాన్ తదుపరి లక్ష్యం క్యూబా అని ప్రకటించారు. ఇరాన్‌తో యుద్ధం ముగిశాక సౌదీఇజ్రాయిల్ దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ట్రంప్ సూచించారు.

The post నిప్ప్పుతో చెలగాటం వద్దు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *