నిధులున్నా పనులు సున్నా!


. ముందుకు కదలని 66 పథకాలు
. ఖాతాల్లో మూలుగుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు
. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం
. అధికారుల అసమర్థతతో కుంటుపడుతున్న ప్రగతి

విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు లేవంటూ సీఎం సైతం అనేక సభల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు… కానీ నిర్ణీత వ్యవధిలోగా కేంద్ర నిధులు వినియోగించుకోవాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి తట్టకపోవడం బాధాకరం. రాష్ట్ర వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పనులు పూర్తిచేసుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కేంద్ర నిధులు బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి. ఉన్న నిధులు పక్కదారి పట్టించకుండా సంబంధిత పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని నిపుణులు సైతం అభిప్రాయపడతున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సుమారు 66 కీలక పథకాలకు సంబంధించి నిధుల వినియోగంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఏకంగా రూ. 6,260 కోట్లు కేంద్ర నిధులు ఖర్చు కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే ఉండిపోయాయి. ఒకవైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం… చేతిలో ఉన్న నిధులను కూడా సకాలంలో ఖర్చు చేయలేకపోవడంపై ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు సింగిల్ నోడల్ ఏజెన్సీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రతి పథకానికి ప్రత్యేక ఖాతా ఉంటుంది. మొత్తం అందుబాటులో ఉన్న రూ. 20,652 కోట్లలో (కేంద్ర వాటా G రాష్ట్ర వాటా G పాత నిల్వలు) కేవలం రూ. 14,096 కోట్లు (68శాతం) మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన 32 శాతం నిధులు ఫైళ్ల రూపంలోనో, సాంకేతిక అడ్డంకుల వల్లో ఆగిపోయాయి. గ్రామీణ పేదలకు కొంగుబంగారం లాంటి ఉపాధి హమీ పథకంలో రూ. 784 కోట్లు నిలిచిపోయాయి. మెటీరియల్ బిల్లుల చెల్లింపులో జాప్యం, ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె, సాంకేతిక లోపాల వల్ల కూలీలకు అందాల్సిన సొమ్ము ఖాతాల్లోనే ఉండిపోయింది. పనులు జరిగినప్పటికీ వేతనాల చెల్లింపులో జాప్యం జరగడం లేదా కొత్త పనులకు అనుమతులు రాకపోవడం వల్ల గ్రామీణ కూలీల వలసలు పెరిగిపోయాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించే ప్రక్రియ పూర్తిగా పడకేసింది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసినా… బిల్లుల చెల్లింపులో ఆలస్యం కావడం వల్ల పేదలపై ఆర్థిక భారం పడుతోంది. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే పథకంలో రూ. 649 కోట్లు మిగిలిపోయాయి. బిల్లులు రాక సగంలో ఆగిపోయిన ఇళ్లు లబ్ధిదారులకు భారంగా మారాయి. పల్లెలను కలిపే లింక్ రోడ్ల కోసం కేటాయించిన రూ. 442 కోట్లు ఖర్చు కాలేదు. దీనివల్ల వందలాది కిలోమీటర్ల రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ నిధుల వినియోగంలో ప్రభుత్వం వెనుకబడింది. గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ లేకపోవడం వల్ల అత్యవసర వైద్య సేవలు, రవాణా కష్టతరం అవుతాన్నాయి. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (రూ. 452 కోట్లు), వైద్య విద్యాభివృద్ధి (రూ. 389 కోట్లు) నిధులు కూడా ఖజానాకే పరిమితమయ్యాయి. గిడ్డంగుల నిర్మాణం, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు వంటి పనులు నిలిచిపోవడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిధులున్నా ఖర్చు చేయలేకపోవడానికి పరిపాలనా యంత్రాంగంలో ఉన్న లోపాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. కేంద్రం వివిధ పథకాలకు తన వాటాగా 60శాతం నిధులు పంపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన 40 శాతం వాటాను సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో జమ చేయడం లేదు. రాష్ట్ర వాటా కేటాయించకపోతే, ఆ ఖాతాలోని కేంద్ర నిధులను కూడా వాడటానికి వీలుండదు. పెరుగుతున్న మెటీరియల్ ధరల వల్ల పాత అంచనాలతో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో, రీ-టెండర్ల ప్రక్రియ నెలల తరబడి సాగుతోంది. ఆర్థిక శాఖకు, అమలు చేసే శాఖలకు మధ్య సరైన సమాచారం లేకపోవడం వల్ల నిధుల విడుదల ప్రక్రియ మందగించింది. కేంద్ర నిబంధనల ప్రకారం, గతంలో ఇచ్చిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేసి వినియోగ ధృవీకరణ సమర్పించకపోతే, తదుపరి విడత నిధులను కేంద్రం నిలిపివేస్తుంది. ఇప్పటికే రూ. 17,893 కోట్ల కేటాయింపుల్లో కేవలం 56 శాతం నిధులే విడుదలయ్యాయి. నిధులు మిగిలిపోతే… వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు తగ్గే ప్రమాదం ఉంది. రోడ్లు, ఇళ్లు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో పూర్తి కాకపోతే రాష్ట్ర ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఇతర పథకాలకు మళ్లించకుండా, కేంద్ర పథకాలకు అవసరమైన ‘స్టేట్ మ్యాచింగ్ గ్రాంట’ను వెంటనే విడుదల చేయాలి. అభివృద్ధికి నిధుల కొరత ఒక సమస్య అయితే, ఉన్న నిధులను వాడుకోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతే.
ప్రభుత్వం తక్షణమే స్పందించి, మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేసి ఖాతాల్లో మూలుగుతున్న ఈ రూ. 6,260 కోట్లను ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం కేవలం అప్పుల కోసం ప్రయత్నించడమే కాకుండా, ఇప్పటికే చేతిలో ఉన్న కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

The post నిధులున్నా పనులు సున్నా! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *