దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. నక్సలిజంపై పోరాటం ఇప్పుడు తుది దశకు చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. 2013లో జీరం లోయలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకులు సహా 32 మంది మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉన్నప్పటికీ, గత పదేళ్లలో పరిస్థితుల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది.
ముఖ్యంగా 2024 తర్వాత మావోయిస్టుల అగ్ర నాయకత్వానికి భారీ దెబ్బ తగిలింది.
2025లో మావోయిస్టు జనరల్ సెక్రటరీ బసవరాజు, మోస్ట్ వాంటెడ్ కమాండర్ హిడ్మా వంటి కీలక నేతలు ఎన్కౌంటర్లలో హతమయ్యారు. గతేడాది మాత్రమే 317 మంది నక్సల్స్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టగా, 2000 మందికి పైగా లొంగిపోయారు. ఒకప్పుడు 126 జిల్లాల్లో విస్తరించిన నక్సల్ ప్రభావం ప్రస్తుతం కేవలం 7 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఈ గడువు ముగియడానికి ఒక్కరోజు ముందు, సోమవారం లోక్‌సభలో నక్సలిజం నిర్మూలనపై ప్రత్యేక చర్చ జరిగింది.
టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ చర్చకు శ్రీకారం చుట్టారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 130 నుంచి 150 మంది వరకు మాత్రమే సాయుధ మావోయిస్టులు మిగిలి ఉన్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీరిని పూర్తిగా అణచివేయడానికి కోబ్రా ప్రత్యేక దళాలు ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ అడవుల్లో భారీ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి.


