Last Updated:
నక్కపల్లి లో Arcelor Mittal Nippon Steel గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపనకు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హాజరు రాష్ట్రానికి నూతన దిశ.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం రేపటి నుంచి చరిత్ర సాక్షిగా నిలవబోతోంది. భారీ స్థాయిలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరుకానుండటంతో ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననుండటంతో నక్కపల్లి పరిసర ప్రాంతం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.
ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా కార్యక్రమ స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాన వేదిక, హెలిపాడ్, గ్యాలరీల వద్ద జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు ఆమె పిలుపునిచ్చారు. రేపటి కార్యక్రమం కేవలం భూమిపూజ మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నాంది అవుతుందని ఆమె స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కోసం తమ భూములను ఇచ్చిన రైతుల త్యాగాలను మరువలేమని హోంమంత్రి పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా ఇది ఒక కీలక మలుపు అవుతుందని, ఈ ప్రాజెక్ట్‌తో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుందని అన్నారు. యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అనకాపల్లి జిల్లా రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ‘ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్’ (AMNS) గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సుమారు రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి వెచ్చించనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఇప్పటికే విశాఖపట్నం చేరుకున్నారు. వారు నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
అంతకు ముందు కేంద్ర మంత్రులు విశాఖ ఉక్కు ప్లాంట్‌ను సందర్శించి అక్కడి పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తం మీద నక్కపల్లిలో జరగనున్న ఈ మెగా కార్యక్రమం రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి నూతన దిశగా మారబోతోందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే అనకాపల్లి జిల్లా మాత్రమే కాదు, మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గణనీయంగా ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh
Mar 22, 2026 10:30 PM IST



