మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;!ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించాలనే దృఢ సంకల్పంతో ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ చొరవతో రూ.98,71,475 విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికు అందించబడినట్లు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ వైద్య పరికరాల ఏర్పాటు కార్యక్రమాన్ని గురువారం హరీష్ బాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రజల ఆరోగ్యాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని ధర్మవరం ప్రాంతంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ అత్యాధునిక పరికరాలను అందించారని తెలిపారు. అతి ముఖ్యమైన ఈ పరికరాల ద్వారా అత్యవసర వైద్యం, ప్రసూతి సేవలు, మరియు సాధారణ రోగుల చికిత్స మరింత వేగంగా, ఖచ్చితంగా, నాణ్యంగా అందించగల సామర్థ్యం ఆసుపత్రికి పెరిగిందన్నారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ దూరదృష్టి ఫలితంగానే ఇంత అధునాతన వైద్య సదుపాయాలు రాష్ట్రంలో కేవలం రెండు చోట్ల మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఒకటి శ్రీకాకుళంలో ఉండగా, రెండవ కేంద్రంగా ఇప్పుడు సత్యసాయి జిల్లాలోని ధర్మవరం ఏరియా ఆసుపత్రి నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.మంత్రి సత్య కుమార్ యాదవ్ అభివృద్ధి దృక్పథం వల్లే ధర్మవరం నియోజకవర్గం ఆరోగ్య రంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించడం మంత్రి లక్ష్యమని తెలిపారు.


