విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పాత ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రి నుండి 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడానికి చర్యలు వేగవంతం అవుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో ఈ ప్రతిపాదనపై అధికారులు పరిశీలన చేపట్టారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ రమేష్ నాథ్‌తో కలిసి ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, పాత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ఆసుపత్రి భవనం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, వైద్య సేవల విస్తరణకు అవసరమైన వసతులపై అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం 50 పడకలతో పనిచేస్తున్న పాత ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ధర్మవరం పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, అదనపు పడకలు, వైద్య సిబ్బంది వంటి సదుపాయాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు
మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయం స్పందనతో సాయి నగర్ కాలనీ సమస్యలకు పరిష్కార దిశగా అడుగు.. మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు.
పట్టణంలోని సాయి నగర్ కాలనీకి చెందిన పలువురు కాలనీ వాసులు మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయాన్ని సందర్శించి తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా కాలనీలో పెండింగ్‌లో ఉన్న సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజ్ కాలువల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కొరత వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రి కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. కాలనీ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వం నేపథ్యంలో ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు స్వయంగా సాయి నగర్ కాలనీని సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలోని రహదారులు, డ్రైనేజ్ వ్యవస్థ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులతో మాట్లాడి వివరంగా తెలుసుకున్నారు. కాలనీ అభివృద్ధి కోసం అవసరమైన పనులను అధికారులతో సమన్వయం చేసి దశలవారీగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని హరీష్ బాబు తెలిపారు. అలాగే ధర్మవరం పట్టణంలోని ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా మంత్రి సత్య కుమార్ యాదవ్ కట్టుబడి ఉన్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిపై వెంటనే స్పందించి పరిష్కారం చూపడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.


