– ప్రజా సమస్యలపై వేగవంతమైన స్పందన..
మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం తప్పక ఉంటుందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బలిజ కళ్యాణ మండపం వీధి పరిధిలో డ్రైనేజీ కాలువల్లో మట్టి పేరుకుపోయి మురుగునీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తొగటవీర సంఘం అధ్యక్షులు గుద్దేటి రాము, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గ కార్యాలయానికి తెలియజేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు, స్థానిక శానిటరీ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్తను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, మధ్యాహ్నం లోపే శుభ్రపరిచే పనులను పూర్తిచేయించారు. దీంతో నిలిచిపోయిన మురుగునీరు సాఫీగా ప్రవహించేలా చేసి, దుర్వాసన సమస్యకు తక్షణ ఉపశమనం కల్పించారు. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి సమస్యలు ఎక్కడైనా కనిపించిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.


