. నూతన కార్పొరేషన్ కొత్తగూడెం పై సిపిఐ జెండా
. మిత్ర ద్రోహానికి తగిన శాస్తి చెప్పిన కార్పొరేషన్ ప్రజలు
. 22 డివిజన్లో సిపిఐ విజయం
. మేయర్ పీఠం అధిష్టించనున్న సిపిఐ
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం : ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తొలి కార్పొరేషన్ కొత్తగూడెం పై ఎర్రజెండా ఎగరేసింది. డబ్బుంటే ఏదైనా చేయొచ్చని ధనహంకారాన్ని ప్రదర్శించిన ముఖ్య ప్రత్యర్థులను కార్పొరేషన్ ప్రజలు తొక్కిపట్టారు. ఎర్రజెండా అహంకారుల మెడలు వంచింది. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కార్పొరేషన్ ప్రజలు సిపిఐ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. భారత కమ్యూనిస్టు పార్టీని తక్కువ అంచనా వేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ అధిక స్థానాలు సిపిఐ మోగించింది. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీకి ఉన్న బలాన్ని మరోసారి కార్పొరేషన్ ఎన్నికల ద్వారా రుజువు చేసింది. కొత్తగూడెం కార్పొరేషన్లు 60 డివిజన్లకు గాను 22 డివిజన్లో సిపిఐ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఎర్రజెండాకు 10 సీట్లు కూడా రావని వేర్రవీగి ప్రచారం చేసిన అహంకారులకు కార్పొరేషన్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. 60 డివిజన్లో 40 కి పైగా గెలుస్తామని విచ్చలవిడిగా డబ్బు నీళ్లల్లా ఖర్చు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి 22 సీట్లకు మించి రాలేదు. 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ 58 పోటీ చేయగా రెండు సీట్లను సిపిఎం పార్టీకి కేటాయించింది. సిపిఎం పార్టీ ఒక డివిజన్లో గెలవగా మరో డివిజన్ లో ఓడిపోయింది. సిపిఐ పార్టీతో మిత్రద్రోహానికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అంతర్గతంగా కాంగ్రెస్ లోనే ఒక వర్గం భావిస్తుంది. సీట్ల కేటాయింపు లోను కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా ఘోర ఓటమికి కారణమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక మంత్రి తో పాటు కొత్తగూడం కు చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు సిపిఐని ఊసులో లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు వారి వ్యూహాలను తిప్పికొట్టారు. కూనంనేని సాంబశివరావు తనదైన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో చాణిక్యుడుల వ్యవహరించి తనదైన శైలిలో చక్రం తిప్పారు. చాలా వ్యూహాత్మకంగా గడచిన పంచాయతీ ఎన్నికల తరహాలోనే కార్పొరేషన్ ఎన్నికల్లోను విజయ పరంపరను కొనసాగించారు. సిపిఐ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూడా స్థానికంగా మద్దతు పలకటం ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా మారింది. మరికొన్ని స్థానాల్లో సిపిఐ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ అభ్యర్థులతో కుమ్మక్కై దెబ్బతీశారు. దీంతో ఆయా స్థానాల్లో స్వల్ప తేడాతో ఐదారుగురు సిపిఐ అభ్యర్థులు ఓడిపోవడం గమనార్హం. కాగా 60 సీట్లుపై బి ఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి తన ఉనికిని కొంతమేరకు చాటుకుంది. ఈ పార్టీలో కూడా ఇరు వర్గాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల సమన్వయం లోపించి మరికొన్ని చోట్ల గెలవాల్సిన సీట్లను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్తో జతకట్టటానికి ససేమేరా అంటున్న బి.ఆర్.ఎస్ అభ్యర్థులు సిపిఐ పార్టీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు ఇండిపెండెంట్లు గా గెలిచిన ఆరుగురు అభ్యర్థులు ఇప్పటికే ముగ్గురు సిపిఐ పార్టీకి మద్దతు ప్రకటించేందుకు ముందుకు వచ్చారు. ఎటు చూసినా కొత్తగూడం తొలి కార్పొరేషన్ మేయర్ పదవి సిపిఐ కి ఖరారు కానుంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిక స్థానాలు సాధించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని తమ పార్టీ పరంగా మాట్లాడి అన్ని విషయాలు సర్దుబాటు చేస్తానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా మేయర్ పదవి విషయంలో సిపిఐ కి మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ మేయర్ పదవి తమకి ఇస్తే చాలని సర్దుకుపోయే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు కనిపిస్తుంది. ఎటు చూసినా సిపిఐ పార్టీకి మేయర్ పదవి ఖరారు కానుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్తో సిపిఐ పార్టీకి పొత్తు కుదురుతుందని తొలుత భావించారు. సిపిఐ పార్టీ కూడా మిత్రులతో కలిసి పోటీ చేయడం ద్వారా అధిక స్థానాలు సాధించవచ్చు అని భావించింది. 25 సీట్లు తమకు కేటాయించాలని సిపిఐ ప్రతిపాదన చేసినప్పటికీ కాంగ్రెస్లోని ఒక మంత్రికి సంబంధించిన నాయకులు 18 కంటే మించి ఇవ్వమని కరాకండిగా చేప్పారు. ఇంకో రెండు సీట్లైనా పెంచమని సిపిఐ పార్టీ ప్రతిపాదన చేసినప్పటికీ డబ్బు అహంకారానికి గురైన కాంగ్రెస్ నేతలు దీన్ని తిరస్కరించారు. ఇప్పుడు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే అహంకారానికి చెంపపెట్టుల మారింది.
దశాబ్దాలుగా కొత్తగూడెంలో ఎర్రజెండాకు బలం ఉంది : దశాబ్దాలుగా సిపిఐ పార్టీకి కొత్తగూడెం నియోజకవర్గంలో స్థిరమైన బలముందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు ఈ సందర్భంగా అన్నారు. సిపిఐ పార్టీకి ఘనవిజయాన్ని అందించిన కార్పొరేషన్ ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. డబ్బు అహంకారంతో విర్రవీగిన వారికి స్థానిక ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని రాజకీయాలు కేవలం డబ్బుతో ముడిపడి ఉండవని ఇప్పటికైనా ఆయా నాయకులు గుర్తించాలని కోరారు. దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై ప్రజల సమస్య కోసం సమస్యల కోసం కార్మికుల కర్షకుల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ సిపిఐ పార్టీ ఎన్నో త్యాగాలు అర్పించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడతామని భరోసా ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ రాజకీయాల కతీతంగా సేవలు అందిస్తామని ఒక ఆదర్శవంతమైన కార్పొరేషన్ గా రూపుదిద్దుతామని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు.
తమపై ఎంతో నమ్మకంతో కార్పొరేషన్ పీఠాన్ని దక్కించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నామని ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా అన్నారు. విశాలాంధ్రతో ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీని ఊసులో లేకుండా చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారని అయినప్పటికీ ప్రజలు తమ పక్షం నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆకాంక్ష మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ ను బహుముఖ అభివృద్ధి చేయడమే కాకుండా ప్రజలకు మరింత విశ్వసనీయమైన సేవలు అందిస్తామని సంక్షేమ పథకాలు చేకూరుస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగరేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలకు, రాత్రి పగలు సైనికుల పనిచేసిన సిపిఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.


