Last Updated:
విజయవాడ సమీపంలో విద్యార్థి ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటనపై చర్చలు జరుగుతున్నాయి. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు జిల్లాల్లో ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఏపీలో ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య జరిగిన ఘర్షణలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో మరో వివాదం విద్యా వ్యవస్థను కుదిపేస్తోంది. విజయవాడ సమీపంలో రెండు రోజుల క్రితం ఒక విద్యార్థి తనకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని తీవ్రంగా కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఉపాధ్యాయుడిపై దాడి చేయడం తప్పు అని పలువురు ఖండిస్తూ, గురువులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
అయితే ఇదే సమయంలో మరోవైపు కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దూరపు విద్య పేరుతో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్ లేదా కాలేజీకి వెళ్లకుండా చదువును కొనసాగించేందుకు ప్రభుత్వం దూరపు విద్య విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఇది ఒక అవకాశంగా భావించారు. పరీక్షలకు నేరుగా హాజరై ఉత్తీర్ణులు కావడానికి ఈ విధానం ఉపయోగపడుతోంది.
అయితే అదే విధానాన్ని కొందరు ఉపాధ్యాయులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఈ వ్యవహారం ఎక్కువగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఇంటర్ దూరపు విద్య పరీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు పరీక్షలకు కలిపి సుమారు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు మాత్రమే ఫీజు చెల్లించాలి. కానీ కొందరు ఉపాధ్యాయులు ఈ ఫీజులు కట్టించే బాధ్యత తీసుకుని ఒక్కో విద్యార్థి నుంచి సుమారు పదిహేనువేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మీరు చదవాల్సిన అవసరం లేదు.. పరీక్షలు కూడా మేమే చూసుకుంటాం అంటూ నమ్మబలికి మధ్యలో అదనంగా తొమ్మిది వేల రూపాయల వరకు అక్రమంగా తీసుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. మొదట్లో విద్యార్థులు నమ్మి డబ్బులు ఇచ్చినా, ప్రస్తుతం పరీక్షల సమయంలో కఠిన నియమాలు అమలు కావడంతో అసలు పరిస్థితి బయటపడుతోంది. పరీక్ష కేంద్రాల్లో కఠినంగా పర్యవేక్షణ జరుగుతుండడంతో మాస్ కాపీయింగ్ లాంటి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.
డబ్బులు తీసుకున్న ఉపాధ్యాయులు ఇప్పుడు పరిస్థితిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. విద్యార్థుల నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వలేకపోవడం, మరోవైపు పరీక్షలు కూడా సులభంగా నిర్వహించలేకపోవడం వల్ల అయోమయం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా మాస్ కాపీయింగ్ జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాకినాడ జిల్లాలో మాత్రం విద్యాశాఖ కఠినంగా వ్యవహరించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ లక్ష రూపాయలకు పైగా జీతాలు పొందుతున్న కొందరు ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని ఉపయోగించుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. డిగ్రీ, ఇంటర్, పదో తరగతి చదివే విద్యార్థులను గుర్తించి వారికి అనుబంధంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఫీజులు వసూలు చేస్తున్నారని సమాచారం. కొన్ని చోట్ల ప్రత్యేకంగా మనుషులను నియమించి ఈ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా అధికారిక జీతంతో పాటు అక్రమ ఆదాయం కూడా భారీగా వస్తోందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అయితే వసూలు చేసిన సొమ్ము వివిధ స్థాయిలకు పంచుతామని కొందరు ఉపాధ్యాయులు చెబుతున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే… దూరపు విద్య పేరిట డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు ఆ సొమ్ము తిరిగి వస్తుందా? లేక పరిస్థితిని మేనేజ్ చేసి చివరకు పరీక్షలు రాయించేలా చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో కూడా చూడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh
Mar 07, 2026 10:39 AM IST


