దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి



*మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదు
*న్యాయ వ్యవస్థ ద్వారా బీజేపీ తన అజెండాను అమలు చేస్తోంది
*దళిత క్రైస్తవులకు అట్రాసిటీ చట్టం వర్తించకపోవడం దుర్మార్గం

సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ

విశాలాంధ్ర-తిరుపతి : దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే పునఃపరిశీలించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో క్రైస్తవ మత పాస్టర్లు, సంఘాల పెద్దలు, విశ్వాసులతో సమావేశమైన ఆయన, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై, న్యాయస్థానాల తీర్పులపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ… భారతదేశంలో ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన అతడి కులం గానీ, సమాజంలో ఎదుర్కొనే అంటరానితనం, వివక్ష గానీ మారిపోవన్న ప్రాథమిక సత్యాన్ని సుప్రీంకోర్టు గ్రహించలేకపోవడం విచారకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం దళిత క్రైస్తవుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పౌరులకు తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కల్పించాయని, కానీ 1950 నాటి పాత ఉత్తర్వులను సాకుగా చూపి హక్కులు నిరాకరించడం అన్యాయమని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీ, సంఘ్ పరివార్ శక్తులు తమ రాజకీయ అజెండాను న్యాయస్థానాల ద్వారా పలికిస్తున్నాయని నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. “గతంలో బాబ్రీ మసీదు వంటి కీలక తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు గవర్నర్ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు కూడా దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన వారికి భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తామని బీజేపీ మభ్యపెడుతోంది” అని ఆయన విమర్శించారు. బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులు దళితులను, మైనారిటీలను అణచివేయడానికి కుట్ర పన్నుతున్నాయని, ఈ కుట్రలో భాగంగానే ఇటువంటి తీర్పులు వస్తున్నాయని ఆయన వాపోయారు. సుప్రీంకోర్టు తన తీర్పును పునఃపరిశీలించకపోతే, దేశవ్యాప్తంగా దళిత, క్రైస్తవ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని, బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పిస్తామని నారాయణ హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *