దళితులకు న్యాయం జరిగేనా ?


విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు మోటిక మునియ్యలు ఆరోపించారు. సుమారు 50 సంవత్సరాలుగా జేగురుపాడు రెవెన్యూలోని దళితుల స్వాధీనంలో సర్వేనెంబర్ 10 లో 5.58 ఎకరాల భూమి ఉందన్నారు.1977 సంవత్సరంలో జిల్లా రెవెన్యూ అధికారులు దళితులకు కేటాయించారని తెలిపారు. ఇటీవల తమ భూమిపై అన్నందేవుల చంటి కన్ను పడిందని, భూ సమీపంలో గల చైతన్య నగర్ ప్రాంతంలో నివసిస్తున్న వారిని రెచ్చగొట్టి, తమ మీదకు ఉసిగొల్పి, గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే ప్రాంతంలో గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూముల్ని తన స్వాధీనంలో పెట్టుకున్నారన్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అలాగే సర్వే నెంబర్ 10 లో గల తమ భూముల అంశాన్ని స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి ఆర్డీఓ, తసీల్దార్లకు విచారణ చేయాలని ఆదేశించారని తెలిపారు. అయితే బుధవారం విచారణకు వచ్చిన ఆర్డీఓ, తహసీల్దార్ లు చంటి ఇంటిలో భోజనాలు చేయడం ద్వారా ఏమేరకు దళితులకు న్యాయం చేస్తారని వారు ప్రశ్నించారు. చట్టాన్ని, న్యాయాన్ని పరిరక్షించాల్సిన అధికారులు ప్రలోభాలకు తలొగ్గకుండా దళితులకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు. దీనిపై కడియం తహసిల్దార్ సునీల్ కుమార్ ను వివరణ కోరగా చైతన్య నగర్ సర్వే నెంబర్ 88 /2 , 88/3 లలో గల సుమారు 4 ఎకరాల భూముల్లో గత కొన్నేళ్లుగా కొందరు స్థానికులు నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారని, జిఓ 30 ప్రకారం రెగ్యులైజ్ చేసే వెసులుబాటులో భాగంగా బుధవారం ఆ ప్రాంతాన్ని ఆర్డిఓ పరిశీలించడం జరిగిందన్నారు. సర్వే నెంబర్ 10 భూములకు ఈ పరిశీలనకు ఏవిధమైన సంబంధం లేదన్నారు. స్థానికుల అభ్యర్థన, గతంలో ఈ భూములకు సంబంధించి జరిగిన వివాదాల నేపథ్యంలో, యాదృచ్చికంగా ఆ భూముల వద్దకు వెళ్లడం  జరిగిందనీ, అలాగే అదే ప్రాంతంలో గల మరి కొన్ని (మైనింగ్)భూముల్ని కూడా పరిశీలించడం జరిగిందని తెలిపారు.

The post దళితులకు న్యాయం జరిగేనా ? appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *