త్వరలో యుద్ధం ముగిస్తాం – Visalaandhra


. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది
. నాటో నుంచి వైదొలుగుతాం
. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది. ఇరాన్‌లో ప్రస్తుత నాయకత్వం గతంతో పోలిస్తే మరింత సహకార దృక్పథంతో ఉంది’ అని ట్రంప్ అన్నారు. అయితే అమెరికా దళాల ఉపసంహరణ అనేది ఇరాన్‌తో కుదిరే ఒప్పందంపై ఆధారపడి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేని స్థితికి చేరుకుందన్నారు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం ముగిసిన వెంటనే అమెరికాలో పెట్రోలు ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నుంచి బయటకు వస్తే చాలు ధరలు ఒక్కసారిగా పడిపోతాయని తెలిపారు.
ఇరాన్ పునర్నిర్మాణానికి 15-20 ఏళ్లు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఆ దేశ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం దాదాపు పూర్తిగా నిర్వీర్యమైందని అన్నారు. నౌకాదళం, వైమానిక దళం, రక్షణ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ దాడుల ప్రభావం నుంచి కోలుకోవడానికి ఇరాన్‌కు 15 నుంచి 20 సంవత్సరాలు పట్టొచ్చని ఆయన తెలిపారు. ఈ యుద్ధంలో ప్రధాన లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమేనని ట్రంప్ తెలిపారు. ఆ లక్ష్యం పూర్తిగా సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు లక్ష్యం కాదని ట్రంప్ చెప్పినా, యుద్ధం వల్ల అక్కడి నాయకత్వ వ్యవస్థలో మార్పులు జరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వారికి సరైన నాయకులు కూడా లేరని తెలిపారు. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ నాయకత్వం తొందరపడుతోందని ట్రంప్ తెలిపారు. గత ఇరాన్ పాలకుల కంటే ఇప్పుడు ఉన్నవారు చాలా వాస్తవిక దృక్పథం ఉన్నవారని, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నారని వివరించారు. అందుకే వారితో చర్చలు సఫలమై ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. వారు చర్చలకు వస్తే అంతా సరిగ్గా ఉంటుందని, కానీ వారు రాకపోయినా పర్వాలేదని అన్నారు.
నాటో ఒక కాగితపు పులి
నాటో కూటమిని ఒక ‘కాగితపు పులి’గా ట్రంప్ అభివర్ణించారు. నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. అందుకే ఇప్పుడు ఆ కూటమి రక్షణ ఒప్పందం నుంచి అమెరికాను తప్పించే అంశం గురించి తాను పునరాలోచన చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక బ్రిటన్ యుద్ధనౌకల పరిస్థితిపై ట్రంప్ ఘాటు విమర్శలు చేశారు. బ్రిటన్‌ను ఉద్దేశిస్తూ, ‘మీకు అసలు నౌకాదళమే లేదు. మీరు చాలా పాతబడిపోయారు. మీ దగ్గర ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా పనిచేయవు’ అని ఎద్దేవా చేశారు
ట్రంప్ వ్యాఖ్యలకు స్టార్మర్ ఘాటు సమాధానం
ట్రంప్ విమర్శలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఘాటుగా స్పందించారు. నాటో పట్ల బ్రిటన్‌కు పూర్తి విశ్వాసం, నిబద్ధత ఉన్నాయని స్పష్టం చేశారు. ‘నాటోను ప్రపంచం చూసిన అత్యంత శక్తివంతమైన ఏకైక సైనిక కూటమి’గా ఆయన అభివర్ణించారు. ‘నాపై లేదా ఇతరులపై ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత రచ్చ జరిగినా, నేను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తాను’ అని ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *