ఇరాన్‌పై రెండు వారాలు సైనిక చర్య నిలిపివేసినట్లు ప్రకటన
. ఈ లోగా ఒప్పందం చేసుకుంటామని వెల్లడి
. పది షరతులతో కాల్పుల విరమణకు అంగీకరించిన తెహ్రాన్
. దురాక్రమణకు పాల్పడితే దీటుగా స్పందిస్తామని హెచ్చరిక
. రేపు ఇస్లామాబాద్‌లో చర్చలకు ఇరుదేశాలకు పాక్ ఆహ్వానం
తెహ్రాన్/వాషింగ్టన్: ఒక్క రాత్రిలో ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామని ప్రగల్బాలు పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…ఇరాన్ చూపిన తెగువకు తల వంచారు. ీVAర్మోజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఇచ్చిన నలభై ఎనిమిది గంటల గడువు మరో గంటలో ముడుస్తుందనగా తోక ముడిచారు. రెండు వారాలపాటు ఇరాన్‌పై సైనికచర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 40 రోజులుగా కొనసాగిన సైనిక ఘర్షణల అనంతరం అమెరికా`ఇరాన్ రెండు వారాల కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్)కు అంగీకరించాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఉపశమనం కలిగించే అంశంగా మారింది. ీVAర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగించడం, అమెరికా విధించిన ప్రాథమిక ఆంక్షలు ఎత్తివేయడం, తమపై ఎలాంటి దురాక్రమణలకు పాల్పడకుండా ఉండటం వంటి 10 పాయింట్లను ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు కూడా సానుకూలంగా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇరాన్ కూడా ఈ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపింది.
పాక్ అభ్యర్థన మేరకే…: ట్రంప్
కాల్పుల విరమణ పరిణామంపై ట్రంప్ ఏమన్నారంటే… “పాక్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును sండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు. ీVAర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించాను. ఇరుదేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ పది సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందానికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుంది. ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నా”అని ట్రంప్ పేర్కొన్నారు.
యుద్ధానికి ముగింపు కాదు: ముజ్తాబా ఖామేనీ
ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం ముజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా చదివి వినిపించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే.. పూర్తి బలంతో దీటుగా స్పందిస్తాం’ అని పేర్కొంది. తక్షణమే కాల్పులు నిలిపివేయాలని అన్ని సైనిక విభాగాలను సుప్రీం నేత ఆదేశించినట్లు వెల్లడించింది.
ఇస్లామాబాద్‌లో చర్చలు
కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో అమెరికా- ఇరాన్ ప్రత్యక్ష చర్చలకు రావాలని పాక్ ప్రధాని షెహబాజ్ పిలుపునిచ్చారు. ఈనెల 10న ఇస్లామాబాద్‌కు రావాలని ఇరుదేశాల ప్రతినిధి బృందాలను ఆహ్వానించారు. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ప్రత్యక్ష చర్చల గురించి సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొంది. అయితే దీనిపై తుది నిర్ణయం అధ్యక్షుడే తీసుకుంటారని వెల్లడించింది.
ఇరాన్‌లో పాలన మారింది… ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అత్యంత ఫలవంతమైన రీతిలో పాలన మార్పు జరిగిందని, ఆ దేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ‘ట్రూత్ సోషల’ వేదికగా ఆయన ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు. భూమిలో లోతుగా పాతిపెట్టిన అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్‌కు అమెరికా సహాయం చేస్తుందని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత కచ్చితమైన శాటిలైట్ నిఘాలో ఉందని, దాడి జరిగిన నాటి నుంచి అక్కడ ఏదీ మార్పు చెందలేదని పేర్కొన్నారు. తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వివరించారు. ఇరాన్‌తో టారిఫ్‌లు, ఆంక్షల ఉపశమనంపై తాము చర్చలు జరుపుతామని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న 15 డిమాండ్లలో చాలా వాటికి ఇప్పటికే అంగీకారం కుదిరిందని ఆయన తన పోస్టులో వివరించారు.
ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50శాతం సుంకాలు
ఇరాన్‌తో కాల్పుల విరమణ అనంతరం ట్రంప్ తాజాగా మరోసారి హెచ్చరికలు చేశారు. తెహ్రాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఇరాన్‌కు ఆయుధాలిస్తూ తమ దేశానికి ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాలకు ఈ టారిఫ్‌లు వర్తిస్తాయన్నారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవంటూ ట్రూత్‌లో పోస్ట్ పెట్టారు.
ఇరాన్ ప్రాధేయపడింది: అమెరికా రక్షణమంత్రి
ఇరాన్‌పై ‘ఆపరేషన్ ఎఫిక్ ఫ్యూరీ’ విజయవంతమైందని అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. తమకు ఎదురయ్యే దుర్భర పరిస్థితి కన్నా ఒప్పందమే మేలని ఆ దేశ కొత్త ప్రభుత్వం గ్రహించిందని అన్నారు. వారికి వేరే మార్గాలు, సమయం లేకపోవడంతో కాల్పుల విరమణకు ప్రాధేయపడిందన్నారు. నిమిషాల్లో ఆ దేశాన్ని కుప్పకూల్చే శక్తి ఉన్నా.. ట్రంప్ దయ చూపించారని పేర్కొన్నారు. అమెరికా షరతులకు ఇరాన్ ఒప్పుకోకపోతే తీవ్రదాడులు జరిగేవన్నారు. వరుస దాడులతో అమెరికా దళాలు ఇరాన్ సైన్యాన్ని నామరూపాల్లేకుండా చేశాయన్నారు. ఆ దేశం వద్ద ఉన్న క్షిపణుల నిల్వలను ధ్వంసం చేశామని.. ఇకపై క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు వంటి ఏ ఆయుధాలు తయారు చేయలేదని పేర్కొన్నారు. 47 ఏళ్లుగా తమకు ఇరాన్‌తో ఉన్న ముప్పు ఇప్పుడు తొలగిపోయిందని అన్నారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హెగ్సెత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి అమెరికా దళాలు ఇరాన్‌లోని 800 లక్ష్యాలపై దాడులు చేశాయని హెగ్సెత్ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఆ దేశ రక్షణ, అణు పారిశ్రామిక స్థావరాలు, ఫ్యాక్టరీలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇజ్రాయిల్‌తో సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ముజ్తాబా ఖామేనీ గాయపడ్డారని హెగ్సెత్ వెల్లడించారు. అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ డాన్ కెయిన్ మాట్లాడుతూ… ఇరాన్‌లో అమెరికా సైనిక లక్ష్యాలు నెరవేరాయని అన్నారు. కాల్పుల విరమణ కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని… అవసరమైతే పోరాటాన్ని పునఃప్రారంభించడానికి తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాల్పుల విరమణకు అంగీకారం… గంటల్లోనే ఇరాన్ కీలక ఆయిల్ రిఫైనరీపై దాడి
కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినట్లు వార్తలు వెలువడిన కొన్ని గంటలకే, లావన్ ద్వీపంలోని ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇక్కడి చమురు శుద్ధి కేంద్రాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. టెహ్రాన్ కూడా ప్రతీకార దాడులు నిర్వహించింది. యూఏఐ, కువైత్‌లపై క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (ఎనఐఓఆర్డీసీ) కంపెనీ లావన్‌పై దాడిని ధృవీకరించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. చెలరేగిన మంటలను అదుపు చేయడానికి వెంటనే భద్రతా మరియు అగ్నిమాపక సిబ్బంది బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలోని సిబ్బందిని సకాలంలో తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎనఐఓఆర్డీసీ తెలిపింది. ఇరాన్ జాతీయ ఇంధన సరఫరా, పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదని ఎనఐఓఆర్డీసీ స్పష్టం చేసింది. అయితే పౌరులు ఇంధన వినియోగాన్ని నియంత్రించుకోవాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని, వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని కోరింది. కువైత్‌లోని పలు చమురు, విద్యుత్ క్షేత్రాలపై దాడులు జరిగాయి. దాదాపు 28 ఇరాన్ డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందని కువైత్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. చమురు శుద్ధి కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లపై డ్రోన్ దాడులు జరగడంతో భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాలపై కూడా క్షిపణి దాడులు జరిగాయి.


