తొలిదశ… నిరసన జ్వాల – Visalaandhra


పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభం
చివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’
కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్

న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష సభ్యులు సభలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపైనా నిరసన తెలిపారు. ఈ క్రమంలో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ కూడా మార్చి 9కి వాయిదా పడింది. అట్లనే రాజ్యసభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా… మధ్యాహ్నం ఒంటి గంట వరకు శూన్య, ప్రశ్నోత్తరాల గంట నడిచాయి. ఆ తర్వాత రాజ్యసభ మార్చి 9కి వాయిదా పడింది. మూడు వారాల విరామ వ్యవధిలో, స్టాండింగ్ కమిటీలు కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేటాయింపులను పరిశీలించడానికి అనుమతిస్తాయి.
మకరద్వారం వెలుపల ప్రతిపక్ష ఎంపీల నిరసన
పార్లమెంటు భవన సముదాయంలోని మకర్‌ద్వార్ వెలుపల కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌పురికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్దీప్ సింగ్ పూరీ తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శన సమయంలో ప్రతిపక్ష ఎంపీలు పూరీకి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శించారు.
వాడివేడిగా చర్చలు
జనవరి 28న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా… ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. 29న ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ సమావేశాలు ప్రారంభం నుంచి వాడివేడిగా జరిగాయి. 2020 నాటి భారత్-చైనా సంఘర్షణకు సంబంధించి జనరల్ నరవణే జ్ఞాపకాల నుండి ఉటంకించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని స్పీకర్ అనుమతించకపోవడంతో ఫిబ్రవరి 2 మధ్యాహ్నం నుండి లోక్‌సభ నాటకీయ దృశ్యాలను చవి చూసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో పదే పదే వాయిదా పడింది. మోదీ సర్కారు వైఖరిపై ప్రతిపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు. ఏడుగురు కాంగ్రెస్, ఒక సీపీఎం సభ్యుడిని బడ్జెట్ సెషన్ నుంచి సస్పెండ్ చేశారు. ప్రధానిపై మహిళా ఎంపీలు దాడి చేసే అవకాశం ఉన్నందున తానే ప్రధానిని సభకు రావద్దని చెప్పానని స్పీకర్ ఓంబిర్లా ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో ప్రధాని సమాధానం లేకుండానే రాష్ట్రపతి కి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఆమోదం పొందింది. ప్రధాని లోక్‌సభలో మాట్లాడకపోయినా దీనిపై రాజ్యసభలో స్పందిస్తూ ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. ఓం బిర్లాను స్పీకర్‌గా తొలగించాలని ప్రతిపక్షాలు అవిశ్వాస నోటీసు ఇచ్చాయి. మార్చి 9న ప్రారంభమయ్యే సెషన్ రెండవ భాగంలో స్పీకర్ బిర్లాను తొలగించాలని కోరుతూ తీర్మానం సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. తన తొలగింపుకు సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే వరకు సభ కార్యకలాపాలకు అధ్యక్షత వహించకూడదని బిర్లా నిర్ణయించుకున్నారు. అలాగే భారత్- అమెరికా వాణిజ్య ఒప్పంద అంశం కూడా పార్లమెంట్‌ను కుదిపేసింది. ముఖ్యంగా లోక్‌సభలో రాహుల్ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ డీల్ ద్వారా ప్రధాని మోదీ దేశాన్ని అమెరికాకు గంపగుత్తగా అమ్మేశారని, అలాగే మోదీ అమెరికాకు సరెండర్ అయిపోయారని విమర్శించారు. ఈ వాణిజ్య ఒప్పందం వల్ల భారతీయ రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆక్షేపించారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ గురించి కూడా ప్రస్తావించారు. జనవరి 28న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ శుక్రవారంతో ముగియగా, రెండో దశ మార్చి 9న ప్రారంభం కానుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో దశ ఏప్రిల్ 2తో ముగియనుంది.
రాహుల్‌పై బీజేపీ ఎదురుదాడి
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు స్పందించారు. దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే సర్కారే తప్పిస్తే మోదీ కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) వంటివాటికి పేదల, రైతుల ప్రయోజనాలను అమ్మేసింది కూడా హస్తం పార్టీయేనని ఆరోపించారు. దేశాన్ని అమ్మడానికి, కొనడానికి ఎవరూ సాహసం చేయలేరని, అలాంటివారు ఇంతవరకు పుట్టలేదన్నారు. మరోవైపు, దేశం అభివృద్ధిపథంలో ఉండడాన్ని కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని అందువల్లే ఆ పార్టీ నేతలు ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిరెన్ రిజిజు మండిపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *