Last Updated:
విశాఖపట్నం పరిసరాల్లో పంచదార, రసాయనాలతో కల్తీ బెల్లం తయారీ పెరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతోంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిదని నమ్మి చాలామంది బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కూడా పంచదారకు బదులుగా బెల్లాన్ని వినియోగించాలని వైద్యులు సూచించడంతో బెల్లం వినియోగం పెరిగింది. అయితే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్న బెల్లంలో కల్తీ జరుగుతోందనే ఆరోపణలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్కెట్లో అమ్ముతున్న కొంత బెల్లం అసలు చెరకు రసంతో తయారైనది కాకుండా పంచదారతో పాటు రసాయనాలు కలిపి తయారు చేస్తున్నారని సమాచారం వెలుగులోకి వస్తోంది.
తెల్లగా మెరిసే బెల్లానికి ఎక్కువ గిరాకీ ఉండటంతో తయారీదారులు నాణ్యతను పక్కనబెట్టి పంచదార మరియు రసాయనాలు కలిపి బెల్లాన్ని తయారు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సహజంగా తయారైన బెల్లం ముదురు రంగులో ఉండగా, రసాయనాలతో తయారుచేసిన బెల్లం తెల్లగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రసాయనాల వాడకం వల్ల బెల్లం ఆకర్షణీయంగా కనిపించినా, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రసాయనాలతో తయారైన బెల్లం వినియోగం వల్ల కిడ్నీ, గుండె సమస్యలు, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్లో ఇటువంటి కల్తీ బెల్లం విక్రయాలు ఆగడం లేదు. ముఖ్యంగా చిన్న క్రషర్లలో తయారయ్యే బెల్లంపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో యజమానులు ఇష్టానుసారం తయారీ కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చెరకు రైతులు తమ పంటను స్థానిక క్రషర్లకు విక్రయిస్తున్నారు. అయితే కొంతమంది క్రషర్ యజమానులు దిగుబడి పెంచుకునేందుకు మరియు తెల్లబెల్లం తయారీ కోసం పంచదార కలిపి రసాయనాలు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విధంగా తయారైన బెల్లాన్ని పెద్ద ఎత్తున మార్కెట్‌కు తరలించి విక్రయాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల చీడికాడ సమీపంలోని జి.కొత్తపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక క్రషర్ వద్ద ఐచర్ వాహనంలో భారీగా పంచదార బస్తాలు తరలించడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల ఆదేశాలతో వాహనాన్ని స్టేషన్‌కు తరలించినప్పటికీ వ్యాపారులు బిల్లులు చూపించడంతో వాహనాన్ని విడిచిపెట్టినట్లు సమాచారం. దీనిపై తహసీల్దార్‌ను సంప్రదించగా ఇది ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిధిలోని అంశమని తెలిపారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రం నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కల్తీ బెల్లం తయారీపై అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో క్రషర్ యజమానులు అడ్డు అదుపు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకరమైన బెల్లం మార్కెట్లోకి చేరుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావించి కొనుగోలు చేస్తున్న బెల్లమే ప్రమాదంగా మారకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Visakhapatnam,Andhra Pradesh



