Last Updated:
మీరు పైసా పైసా కూడబెట్టే ఆలోచనలో ఉంటే కొందరు చీటీ వ్యాపారులు మిమ్మల్ని ఎలా మోసం చేయాలనే ప్లాన్లు వేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది….
పరవాడలో చీటీ మోసం కేసు సంచలనం సృష్టిస్తోంది. పైసా పైసా కూడబెట్టి పెట్టుబడులు పెట్టిన ప్రజలను కోట్ల రూపాయల మేర మోసం చేసి పరారైన తాజా మాజీ ఉప సర్పంచి బండారు రామారావు, ఆయన భార్య లక్ష్మిని పోలీసులు అరెస్టు చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది. బుధవారం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పరవాడ బీసీ కాలనీకి చెందిన రామారావు గతంలో ఉప సర్పంచిగా పనిచేశారు. ఆయన భార్య లక్ష్మి అంగన్‌వాడీ కార్యకర్తగా పని చేసి కొద్ది నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ దంపతులు దాదాపు పదేళ్లుగా అనధికారికంగా చీటీ వ్యాపారం నిర్వహిస్తూ వచ్చారు. చిన్న మొత్తాల నుంచి భారీ మొత్తాల వరకు చీటీలు నిర్వహిస్తూ స్థానికంగా విశ్వాసం సంపాదించారు.
రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చీటీలు నిర్వహిస్తూ, అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించారు. మొదట్లో కొంతమందికి లాభాలు ఇచ్చి నమ్మకం పెంచుకున్న ఈ దంపతులు, తర్వాత భారీగా డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా తప్పించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల చీటీలు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో, అలాగే అప్పులు ఇచ్చినవారు డబ్బు కోసం ఒత్తిడి చేయడంతో రామారావు దంపతులు అకస్మాత్తుగా ఇంటి నుంచి పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత నెల 28న గొర్లెవానిపాలెం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీకి చెందిన మొలిచర్ల చిన్నమ్ములు సహా పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలు, ముఖ్యంగా మొబైల్ ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా నిందితుల జాడను పోలీసులు కనుగొన్నారు. మంగళవారం రాత్రి విజయనగరం టౌన్‌లో వారిని అరెస్టు చేసి పరవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పెద్ద సంఖ్యలో బాధితులు స్టేషన్‌కు చేరుకుని తమ గోడును పోలీసులకు వివరించారు.
ప్రాథమిక దర్యాప్తులోనే సుమారు రూ.65 లక్షల మేర ఫిర్యాదులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అయితే మొత్తం చీటీలు, అప్పులు కలిపి ఈ మోసం రూ.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో బాధితుల్లో ఆందోళన మరింత పెరిగింది. తమ జీవిత పొదుపులు కోల్పోయామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని బాధితులు ముందుకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. చీటీ వ్యాపారాల పేరుతో జరుగుతున్న ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



