తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. – Visalaandhra


పలు జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
తెలంగాణలో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
గురువారం ఉదయం 10 గంటల నుంచే వేడి గాలులు, ఉక్కపోత మొదలై మధ్యాహ్నానికి ఆరుబయట ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సాధారణ స్థాయికన్నా సుమారు 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, 10 జిల్లాల్లో 41.1 నుంచి 41.8 డిగ్రీల మధ్య నమోదు కావడం గమనార్హం.అత్యధికంగా నల్గొండ జిల్లా గుడిపల్లి మండలంలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.జగిత్యాల జిల్లా ధర్మపురి, నిజామాబాద్ జిల్లా మోస్రలలో 41.6 డిగ్రీలు నమోదవగా, ఖమ్మం పట్టణం, నిర్మల్ జిల్లా మామడలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఎండల ప్రభావం మరింత పెరిగే అవకాశం
రాబోయే రోజుల్లో ఎండల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాలపై ఉపరితల గాలుల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *