తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వాయిదా.. ఈసీ కీలక నిర్ణయం


దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది. తొలి దశలో గతేడాది బిహార్‌లో ఈ ప్రక్రియ పూర్తయింది. రెండో దశలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కేరళ సహా 11 రాష్ట్రాల్లో ఈ సవరణలు చేపట్టగా, ప్రస్తుతం అవి చివరి దశకు చేరుకున్నాయి.
మూడో దశలో తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100 శాతం మ్యాపింగ్‌ పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా వాయిదా
అసలు ఏప్రిల్‌లోనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఈసీ కార్యాచరణ రూపొందించినప్పటికీ, వచ్చే నెలలో జరగనున్న జనగణనతో పాటు ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా దీన్ని వాయిదా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు చోట్ల నమోదైన ఓటర్ల సంఖ్య సుమారు 4.5 లక్షలుగా ఉందని అంచనా. ఇప్పటికే నిర్వహించిన ప్రాథమిక సర్వేలో దాదాపు 2 లక్షల ఓట్లను తొలగించారు.
తుది సర్వే పూర్తయ్యాక మరణించినవారి పేర్లు, ఇతర ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వారి పేర్లను కూడా జాబితా నుంచి తొలగించనున్నారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా మొత్తం 11 రకాల గుర్తింపు పత్రాలను ప్రామాణికంగా పరిగణించనున్నారు.

పరిగణలోకి ఇతర ప్రమాణ పత్రాలు
1987కు ముందు జన్మించిన వారు తల్లిదండ్రుల వివరాలు సమర్పించాల్సి ఉండగా, 1987 నుంచి 2004 మధ్య జన్మించిన వారు జనన సర్టిఫికెట్‌ ఇవ్వాలి. 2004 తర్వాత జన్మించిన వారికి ఇతర ప్రమాణ పత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. వీటిలో పాస్‌పోర్ట్‌, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కార్డు, బ్యాంకులు, ఎల్‌ఐసీ, స్థానిక సంస్థలు జారీ చేసిన పత్రాలు, బర్త్‌, కుల సర్టిఫికెట్లు, యూనివర్సిటీ సర్టిఫికెట్లు, పర్మినెంట్ రెసిడెన్స్ పత్రాలు, ఫారెస్ట్ రైట్స్ డాక్యుమెంట్లు, జాతీయ గుర్తింపు కార్డు, కుటుంబ గుర్తింపు పత్రాలు, అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూమి లేదా నివాస కేటాయింపు పత్రాలు వంటి వాటిని సమర్పించవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *