అమెరికాకు క్యూబా హెచ్చరిక
హవానా: తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని తీవ్రస్థాయిలో ప్రతిఘటిస్తామని క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్-కానెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అత్యవసర చర్యలు’ వ్యాఖ్యలను ఎక్స్ మాధ్యమంగా ఆక్షేపించారు. కరేబియన్ దీవులను తాను ఏమైనా చేయగలనన్నట్లుగా ట్రంప్ వ్యవహరిస్తున్నారన్నారు. క్యూబా రాజ్యాంగ వ్యవస్థను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నా యని, బహిరంగంగా హెచ్చరికలు అందుతు న్నాయని చెప్పారు. ఆరు దశాబ్దాలకుపైగా ఆర్థిక ఆంక్షల ఎదుర్కొంటున్న క్యూబాలో సంక్షోభాన్ని సాకుగా చూపుతూ దండయాత్రకు అమెరికా ప్రణాళికలు రచిస్తోందని దుయ్యబట్టారు. ఈ చర్యలకు తీవ్రస్థాయిలో ప్రతిఘటన తప్పబోదన్నారు.
ఇంధన సరఫరాలో అంతరాయం వల్ల క్యూబాలో విద్యుత్ కోతలు కొనసాగుతు న్నాయి. ఈ పరిస్థితిని ప్రభుత్వ మార్పునకు సాకుగా వాడుకునే ప్రయత్నాన్ని అమెరికా చేస్తోంది. కానెల్ రాజీనామాను కోరుకుం టోంది. ట్రంప్‌తో పాటు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఈ మేరకు డిమాండ్ చేసినట్లు తెలిసింది. క్యూబాను ఒంటరి చేసేలా అమెరికా తెస్తున్న ఒత్తిడికి తలొగ్గిన తమ దేశంలోని తన రాయబార కార్యాలయాన్ని కోస్టారికా మూసివేసిందని క్యూబా విదేశాంగ శాఖ విమర్శించింది. ఏ విదేశీ ఒత్తిడి లొంగబోమని, క్యూబా ప్రజలు ఐక్యంగా పోరాడతారని కానెల్ అన్నారు. అయితే అమెరికా ఆంక్షలతో క్యూబాలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవుతున్నది. ఈనెల 16న దేశవ్యాప్తంగా విద్యుత్ కోత ఏర్పడింది. పది లక్షల మంది జనాభాగల క్యూబాలో కనీసం కోటి మంది విద్యుత్ కోతలతో ఇబ్బంది పడుతున్నారు. రాజధాని హవానాలో ఐదు శాతం మందికి అంటే సుమారు 42 వేల మందికి విద్యుత్ సరఫ రాను పునరుద్ధరించినట్లు క్యూబా ఇంధన శాఖ వెల్లడించింది. దేశ విద్యుత్ వ్యవస్థ ‘సంపూర్ణంగా డిస్‌కనెక్షన’ అయిందని, గ్రిడ్ కూలినప్ప్పుడు యూనిట్లలో వైఫల్యాలు లేవని, దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపింది. క్యూబా తన పెట్రోలియం అవసరాల్లో 40 శాతాన్ని సొంతంగా తీర్చుకోగలుగుతోంది. విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేసుకుంటున్నది కానీ, అది దేశీయ అవసరాలకు సరిపోవడం లేదు. మూడు నెలలుగా చమురు సరఫరా లేక, సౌర విద్యుత్, థర్మల్ ప్లాంట్లు, నేచరుల్ గ్యాస్ ప్లాంట్లపైనే ఆధారపడాల్సి వస్తున్నట్లు అధ్యక్షుడు డియాజ్ కానెల్ ఇటీవల వెల్లడించారు. తమ విద్యుత్ కష్టాలకు అమెరికా విధించిన ఇంధన దిగ్భంధనమే కారణమన్నారు. విద్యుత్ సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. కాగా ఇరాన్ తదుపరి లక్ష్యం క్యూబా అని అమెరికా ప్రకటించడం విదితమే.


